Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దులో మూడు రెట్లు పెరిగిన డ్రోన్ చొరబాట్లు..!

ఇటీవల భారత్-పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు గణనీయంగా పెరిగాయి. బీఎస్ఎఫ్ అధికారుల డేటా ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డ్రోన్ కదలికలు మూడు రెట్లు పెరిగాయి. 2021లో డ్రోన్ కదలికలు 104 సార్లు కనిపించగా, 2023లో 311 సార్లు కనిపించాయని సైనిక వర్గాలు చెబుతున్నాయి. 

Drone sighting along border with Pak tripled in one year; 311 observations in 2022
Author
First Published Dec 27, 2022, 6:29 AM IST

సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా అక్రమంగా డ్రగ్స్,ఆయుధాలు రవాణా చేస్తున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో దాదాపు ప్రతిరోజూ డ్రోన్ చొరబాట్ల ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పంజాబ్, జమ్మూ సరిహద్దు నుండి డ్రోన్ల ద్వారా పంపిన పెద్ద మొత్తంలో డ్రగ్స్,ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021తో పోలిస్తే 2022లో పాకిస్తాన్ నుండి డ్రోన్ చొరబాట్లు మూడు రెట్లు పెరిగాయి.  

భారీగా పెరిగిన డ్రోన్ చొరబాట్లు  

గత సంవత్సరాలతో పోలిస్తే.. 2022లో పాకిస్థాన్ నుంచి డ్రోన్ చొరబాట్ల కేసులు రెట్టింపు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. 2020 సంవత్సరంలో 79 సార్లు డ్రోన్ చొరబాట్లు కనిపించగా.. ఈ ఏడాది డిసెంబరు 23 వరకు 311 సార్లు కనిపించాయని సైనిక వర్గాలు చెబుతున్నాయి. 2021లో ఈ సంఖ్య 104గా ఉంది. 2021తో పోలిస్తే .. ఈ ఏడాది భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ చొరబాట్లు మూడు రెట్లు పెరిగాయి. ఈ ఏడాది ఒక్క పంజాబ్ సరిహద్దులోనే 220కి పైగా డ్రోన్ చొరబాటు కేసులు వెలుగులోకి వచ్చాయి.

అదే సమయంలో.. జమ్మూలో ఇప్పటివరకు దాదాపు 25 సార్లు డ్రోన్లు కలకలం రేపాయి. ఏడాదికేడాది డ్రోన్‌ చొరబాటు ఘటనలు పెరుగుతున్నాయి.. 2020 జనవరి 1 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 వరకు 492 సార్లు డ్రోన్లు కలకలం రేపాయి. వీటిలో పంజాబ్ ప్రాంతంలో 369, జమ్ములో 75, రాజస్థాన్‌లో 40, గుజరాత్‌లో 8 సార్లు డ్రోన్లు ప్రవేశించిన ఘటనలు నమోదయ్యాయి. 

పంజాబ్‌లో పెరుగుతున్న చొరబాట్లు..  

పంజాబ్‌లో అత్యధికంగా డ్రోన్లు ప్రవేశించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అమృత్‌సర్‌లో 164, గురుదాస్‌పూర్‌లో 96, ఫిరోజ్‌పూర్‌లో 84, అబోహర్ జిల్లాలో 25 సార్లు డ్రోన్‌లు కనిపించాయని సైనిక వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో జమ్మూ సరిహద్దులోని ఇంద్రేశ్వర్ నగర్‌లో 35, జమ్మూలో 29, సుందర్‌బానిలో 11 సార్లు డ్రోన్‌ లు కనిపించాయి. అదేవిధంగా.. శ్రీ గంగానగర్‌లో 32, బార్మర్‌లో ఏడు, ఉత్తరాన బికనీర్, జైసల్మేర్‌లో మూడు, దక్షిణ జైసల్మేర్ లో రెండు సార్లు డ్రోన్లు ప్రవేశించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 

మరోవైపు..ముందస్తుగా అప్రమత్తమైన BSF సిబ్బంది 2022లో ఇప్పటివరకు 20 కంటే ఎక్కువ పాకిస్తానీ డ్రోన్‌లను కూల్చివేసింది. సుమారు 45 కిలోల హెరాయిన్‌తో పాటు ఆయుధాలు , మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏడు గ్రెనేడ్లు, రెండు మ్యాగజైన్లు, 60 రౌండ్ల మందుగుండు సామగ్రి,ఇతర ఆయుధాలు ఉన్నాయి.  అటువంటి క్షిష్ట పరిస్థితిలో.. ఈ సవాలును ఎదుర్కోవడంలో మరింత విజయాన్ని సాధించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. 

డ్రోన్ కార్యకలాపాలపై పార్లమెంట్‌లోనూ ఆందోళన

ఇటీవల.. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా పార్లమెంట్ లో మాట్లాడుతూ.. పెరుగుతున్న డ్రోన్ చొరబాటుపై ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల నుంచి పెద్దఎత్తున డ్రోన్‌లను పంపుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ & కాశ్మీర్‌లలో ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయమనీ,  సరిహద్దులో కూల్చివేసిన డ్రోన్‌లు చైనాకు ఉన్న సాంకేతికతలను ఉపయోగించాయి. డ్రోన్‌లను కాల్చివేసే రేటు కూడా చాలా తక్కువ అని రాజీవ్ శుక్లా గణాంకాల ద్వారా తెలిపారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ సామర్థ్యం గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని శుక్లా డిమాండ్ చేశారు.

2022లో సరిహద్దులో డ్రోన్ల చొరబాట్లు పెరిగిన తర్వాత.. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఎంతవరకు ఎదుర్కొగలదనే ప్రశ్న తలెత్తుతుంది. భద్రతా బలగాల వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉందా? ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత వరకు డ్రోన్ల చొరబాటును నియంత్రించవచ్చు? అనే సందేశాలు వెల్లువెత్తున్నాయి. అయితే..  రాబోయే 2023లో డ్రోన్ కార్యకలాపాలను నిలిపివేయడానికి అనేక రంగాల్లో సన్నాహాలు జరుగుతున్నాయని BSF అధికారులు తెలిపారు. \

కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సరిహద్దు రాష్ట్రాల ఏజెన్సీలు, అధికారులతో సమావేశాలలో అనేకసార్లు చర్చించారు. అక్టోబరులో శ్రీనగర్‌లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో సరిహద్దు అవతల నుండి డ్రోన్ కార్యకలాపాలు అకస్మాత్తుగా పెరగడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో అత్యున్నత భద్రతా, నిఘా సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు.

అప్రమత్తమైన బీఎస్ఎఫ్

అదే సమయంలో పాకిస్తాన్ నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను మోసుకెళ్ళే డ్రోన్‌లను తిప్పికొట్టగలిగామని BSF పేర్కొంది. భారత్- పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు మొత్తం పొడవు 2,900 కిలో మీటర్లు. దానిని రక్షించే బాధ్యత సరిహద్దు భద్రతా దళం భుజాలపై ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 5,500 కెమెరాలతో యాంటీ-డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరగనుంది. సరిహద్దులను మరింత పటిష్టం చేసేందుకు 30 కోట్ల రూపాయలను BSF వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఇది రాబోయే సంవత్సరంలో ప్రయోజనకరంగా ఉంటుంది.  

పగలు-రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయడానికి భారత డ్రోన్‌లను కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు బీఎస్‌ఎఫ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్ చెప్పారు. అదే సమయంలో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్రాల పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నారు. సరిహద్దులో యాంటీ-డ్రోన్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేశామని, అయితే మొత్తం పశ్చిమ సెక్టార్‌ను కవర్ చేసే మెగా సెటప్ మా వద్ద లేదని కూడా ఆయన చెప్పారు. ఇందుకోసం పలు భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఈ కొత్త టెక్నాలజీని వినియోగించుకోవచ్చని బీఎస్‌ఎఫ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్ తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios