ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవ‌ల చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇది సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుతమైన ఘట్టం.

ఈ చారిత్రాత్మక వంతెన రూపకల్పన, ప్రణాళిక, నిర్మాణం కోసం భారత రైల్వేలు, AFCONS కంపెనీ ముఖ్య పాత్ర పోషించాయి. దేశమంతా, అంతర్జాతీయంగా అనేక మంది నిపుణులు ఈ ప్రాజెక్టుకు తమ మేధస్సును, శ్రమను అందించారు. ఈ వంతెన నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన వారిలో మ‌హిళా ఇంజ‌నీర్ మాధవి లత ఒక‌రు. ఏపీకి చెందిన మాధ‌వి ల‌త పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది. ఆమెపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిసింది. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా స్లోప్ స్టెబిలైజేష‌న్, స్లోప్ మీద ఫౌండేష‌న్ డిజైన్ చేసే పనిని నాకు అప్ప‌గించార‌ని, కానీ ఈ మిష‌న్ వెనక ఉన్న మహిళ’, ‘అసాధ్యాన్ని సాధ్యం చేసింది’, ‘చరిత్ర సృష్టించింది’ లాంటి మాటలు కాస్త అతిశ‌యోక్తిగా ఉంద‌ని ఆమె అన్నారు. ఈ వంతెన నిర్మాణంలో నేను మాత్ర‌మే కాదు, నాలాంటి వేలాది మంది కృషి ఉంద‌ని అన్నారు. వారందరూ కీర్తికి అర్హులు. నా పేరు మాత్రమే బయటకు రావడం నన్ను సంతోషపెట్టలేదని చెప్పుకొచ్చారు.

అయితే చాలా మంది తండ్రులు త‌న‌లా, తమ కుమార్తెలను చూడాలని చెప్తున్నారని, ఇది త‌న‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగించింద‌న్నారు. కానీ, దయచేసి త‌న‌కు అవసరం లేని పాపులారిటీ ఇవ్వొద‌ని చెప్పుకొచ్చారు మాధ‌వి.

ఇంత‌కీ ఎవరీ మాధవి లత ?

ప్రకాశం జిల్లా యడుగుండ్లపాడు అనే ఓ సాధారణ గ్రామంలో జన్మించిన మాధవీ లత జీవిత యాత్ర అసాధారణం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈ తెలుగమ్మాయి, సాంకేతిక రంగంలో దేశానికి పేరును తీసుకురావడమే కాకుండా, పలు అవార్డులు సైతం గెలుచుకున్నారు. మాధవీ లత బి.టెక్‌ను JNTU నుంచి పూర్తిచేశారు. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎంటెట్ గోల్డ్ మెడ‌ల్ సాధించారు. 

ఆపై IIT మద్రాస్లో పీహెచ్.డీ పూర్తి చేశారు. 2003లో మాధవీ లత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరారు. ప్రస్తుతం ఆమె సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.