Delhi Acid Attack: ఆదివారం ఉదయం ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ దగ్గర 21 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఆమెను వేధిస్తున్న నిందితుడు జితేంద్ర, అతని ఇద్దరు స్నేహితులు యాసిడ్ పోసి పారిపోయారు.

Delhi Acid Attack: దేశ రాజధానిలో యాసిడ్ దాడి చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో లక్ష్మీబాయి కాలేజీ దగ్గర 21 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో యువతికి గాయాలయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ రెండో సంవత్సరం (నాన్-కాలేజ్) చదువుతున్న ఆ విద్యార్థిని, అదనపు క్లాస్ కోసం కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

విద్యార్థినికి వేధింపులు.. ఆపై యాసిడ్ దాడి

పోలీసుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అదనపు తరగతి కోసం కాలేజీ వైపుకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెపై దుండగులు యాసిడ్ తో దాడి చేశారు. ఈ సంఘటనలో విద్యార్థిని ముఖాన్ని రక్షించుకోగలిగింది. అయితే రెండు చేతులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆమెను దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఆర్‌ఎమ్‌ఎల్‌ ఆసుపత్రికి మార్చినట్లు అధికారులు తెలిపారు.

బాధితురాలు డీయూ రెండో సంవత్సరం (నాన్ కాలేజీ) విద్యార్థిని. జితేంద్ర అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దాదాపు ఒక నెల క్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం వుందన్నారు. 

ఆదివారం ఉదయం జితేంద్ర తన ఇద్దరు మిత్రులు ఇషాన్, ఆర్మాన్‌లతో కలిసి మోటార్‌సైకిల్ పై వచ్చాడు. ఇషాన్ తన చేతిలో ఉన్న సీసాను ఆర్మాన్‌కు అందించగా, ఆర్మాన్ ఆమెపై యాసిడ్ పోశాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. దాడి తరువాత ముగ్గురు అక్కడి నుండి పరారయ్యారు.

నిందితుల కోసం పోలీసుల వేట 

డీసీపీ కార్యాలయం తెలిపిన ప్రకారం, సంఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదుచేశారు. క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. పోలీసులు నిందితులైన జితేంద్ర, ఇషాన్, ఆర్మాన్ ల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

ఈ సంఘటనతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. కాలేజీ విద్యార్థుల భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు నిరోధించడానికి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

యాసిడ్ దాడి వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) స్పందించింది. ఈ కేసు పై పోలీసుల నుంచి పూర్తి నివేదిక కోరనున్నట్లు అధికారులు తెలిపారు. బాధితురాలికి అవసరమైన వైద్యం, న్యాయ సహాయం అందేలా చూస్తామని తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్నారనీ, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.