- Home
- National
- Prada: ఈ చెప్పుల ధర అక్షరాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియన్ కంపెనీ ఒప్పందం
Prada: ఈ చెప్పుల ధర అక్షరాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియన్ కంపెనీ ఒప్పందం
Prada: ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ ప్రాడా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ కళాకారులతో కీలక ఒప్పందం చేసుకుంది. కొల్హాపురి చెప్పుల నుంచి ప్రేరణతో లిమిటెడ్ ఎడిషన్ సాండల్స్‌ను రూపొందిస్తున్నారు.

ప్రాడా – భారతీయ కళాకారులతో కీలక ఒప్పందం
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా, డిసెంబర్ 11న LIDCOM, LIDKAR అనే ప్రభుత్వ సంస్థలతో MoU సంతకం చేసింది. ఇవి భారతదేశం సంప్రదాయ కొల్హాపురి చప్పల్స్, చర్మ కళలను రక్షించే సంస్థలు. ఇందులో భాగంగా ప్రాడా, కొల్హాపురి చప్పల్స్ నుంచి ప్రేరణ పొందిన లిమిటెడ్ ఎడిషన్ సాండల్స్‌ను రూ.85,000 ధరకు విడుదల చేయనుంది.
మొదట్లో విమర్శలు
2026 మెన్స్ కలెక్షన్‌లో ప్రాడా చూపించిన సాండల్స్ సంప్రదాయ కొల్హాపురి చప్పల్స్‌లా ఉన్నాయని, కానీ భారతీయ కార్మికులకు క్రెడిట్ ఇవ్వలేదని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. వీటిని ఏకంగా రూ. 1.12 లక్షలకు విక్రయించారు. దీంతో ప్రాడా సాంస్కృతిక దోపిడీ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రాడా “PRADA Made in India x Inspired by Kolhapuri Chappals” పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
భారత్‌లోనే తయారీ
ఈ కలెక్షన్‌కు చెందిన 2,000 జతల సాండల్స్ పూర్తిగా భారత్‌లోనే తయారీ చేయనున్నారు. ముఖ్యంగా.. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, సొలాపూర్, కర్ణాటకలోని బేలగావి, బాగల్‌కోట్, ధారవాడ, బీజాపూర్‌లో తయారు చేయనున్నారు. ఈ ఎనిమిది జిల్లాలకు చెందిన కార్మికులు స్వయంగా చేతులతో చెప్పులను తయారు చేస్తారు. ఇవి సంప్రదాయంగా ప్రత్యేక పద్ధతులతో చేతితో తయారుచేసే GI-ట్యాగ్ పొందిన చెప్పులు. ప్రాడా తమ తయారీ టెక్నాలజీని, భారతీయ సంప్రదాయ పద్ధతులతో కలిపి ప్రపంచానికి పరిచయం చేయనుంది.
కళాకారులకు శిక్షణ
ప్రాడా, LIDCOM, LIDKAR కలిసి 3 ఏళ్ల శిక్షణ ప్రోగ్రాం ప్రారంభించనున్నాయి. ఇందులో భాగంగా భారతీయ కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కొంతకాలం ఇటలీలోని ప్రాడా అకాడమీ వద్ద ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు. వీరికి సరైన పారితోషికం అందిస్తారు. ప్రాడా ఈ ప్రాజెక్టు కోసం కోట్లలో ఖర్చు చేయనుంది. అధికారుల అంచనా ప్రకారం, ప్రాడా ఈ కళను లగ్జరీ రేంజ్‌లో ప్రవేశపెట్టడం వల్ల డిమాండ్ భారీగా పెరిగే అవకాశముంది.
భారత మార్కెట్‌పై దృష్టి కానీ..
ప్రాడా ఇప్పటికే ఢిల్లీలో ఒక బ్యూటీ స్టోర్ తెరిచినా, ఇప్పటికిప్పుడు దుస్తుల స్టోర్లు లేదా ఫ్యాక్టరీలు భారత్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో లేదు. 3–5 ఏళ్లలో స్టోర్లు ప్రారంభించే అవకాశం ఉందని ప్రాడా పేర్కొంది. 2024లో భారత లగ్జరీ మార్కెట్ విలువ $7 బిలియన్ కాగా, 2030 నాటికి $30 బిలియన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చైనా మార్కెట్‌తో పోలిస్తే ఇది తక్కువేనని చెప్పాలి. ఇప్పటి వరకు చాలా వరకు గ్లోబల్ బ్రాండ్లు ఇండియాలోకి అంబానీ లేదా ఆదిత్య బిర్లా గ్రూప్‌తో జతకట్టగా.. ప్రాడా మాత్రం స్వంతంగా ప్రవేశించాలని భావిస్తోంది.

