దూసుకొస్తున్న మోంథా తుపాను.. అంతటా హై అలర్ట్
Cyclone Montha : రాష్ట్రానికి 'మొంథా' తుపాను ముప్పు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం క్రియాశీలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో ఈ వాయుగుండం గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు. నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం వైపు ఈ వాయుగుండం వచ్చే 12 గంటల్లో ‘తుపానుగా’ బలపడుతుందని వెల్లడించారు. ఈ తర్వాత ఇది ‘తీవ్ర తుపానుగా’ మారే అవకాశముందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి ఈ కేంద్రబిందువు చెన్నైకి సుమారు 770 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 820 కిలోమీటర్లు, కాకినాడకి 810 కిలోమీటర్లు దూరంలో ఉంది.
మూడు రోజులు భారీ వర్షాలు
తుఫాను ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో సోమవారం ఉత్తర ఆంధ్రాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వర్గాలు హెచ్చరించాయి.
ఈ ప్రాంతాల్లో తుపాను ప్రభావం
• కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.
• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.
• మధ్య, దక్షిణ జిల్లాలైన ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
• తీవ్రమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితం, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆరోగ్య, వైద్య విభాగాలు అప్రమత్తం
రాష్ట్రంలో తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా “స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ (SOPs)” రూపొందించింది. ఈ SOPs లో ముఖ్యంగా:
• తుపానుకు ముందుగా అసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సేవలను మరింతగా విస్తరిస్తూ సిద్ధంగా ఉండటం.
• తుపాన్ వచ్చినప్పుడు వైద్యులు, సిబ్బంది ఎలా స్పందించాలనే విషయాలపై ముందస్తు ప్రణాళికలు
• తుపాను తర్వాత వస్తున్న వ్యాధులు నివారించే చర్యలు
• జిల్లా, రాష్ట్ర స్థాయిలో వైద్య సంరక్షణ వ్యవస్థల మధ్య సమన్వయం చేయడం వంటి విషయాలు ఉన్నాయి.
విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం
రాష్ట్ర హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, తాజా పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆదివారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్ష జరిగింది. మూడు రోజుల పాటు ప్రమాదం పొంచివుంది. భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల మధ్య తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
24/7 వరద పర్యవేక్షణ సెల్‌ను నిర్వహించాలనీ, నదులు, కాలువలు గట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. బలహీన రోడ్లు, వంతెనలు, కల్వర్టులను గుర్తించి మరమ్మతులు చేయాలని, క్లీరెన్స్ పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజల తరలింపు కోసం వాహనాలు, డ్రైవర్లు, ఇంధనం సిద్ధంగా ఉండాలని రవాణా శాఖను ఆదేశించారు. సురక్షిత తాగునీటి సరఫరా, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు, మొబైల్ శుద్ధి యూనిట్లు ఏర్పాట్లను వేగవంతంగా చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి శాఖలకు ఆదేశాలు ఇచ్చారు.
ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండాలని వైద్య శాఖకూ సూచించారు. మత్స్యకార గ్రామాల్లో తుఫాన్ హెచ్చరికలు, నివారణ చర్యలు చేపట్టాలని మత్స్య శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. APS DRF, NDRF బృందాలు రక్షణ బృందాలతో సమన్వయం చేసి, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.