Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు సంఘటన దేశంమొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొదట్లో ప్రమాదంగా భావించినా ఆ తర్వాత ఇందులో ఉగ్ర కుట్ర దాగి ఉందని తేలింది. కాగా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దర్యాప్తులో కీలక మలుపు
ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలుడు ఘటనలో 15 మంది మృతి చెందగా, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో ఇప్పుడు పాకిస్థాన్ ఆధారిత జైష్-ఎ-మోహమ్మద్ టెరర్ గ్రూప్ పాత్రపై దృష్టి పెట్టాయి. నిందితులకు బాంబు తయారీ మార్గదర్శకాలు పాకిస్థాన్ నుంచి పంపినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాల ప్రకారం, “హంజుల్లా” అనే పేరు తో ఉన్న జైష్ టెరర్ హ్యాండ్లర్, ప్రధాన నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు బాంబు తయారీ వీడియోలు, ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. హంజుల్లా అసలు పేరు మార్చుకుని పనిచేస్తున్నాడని అధికారులు భావిస్తున్నారు. అతని డిజిటల్ ట్రైల్ ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కాశ్మీర్‌లో పోస్టర్లు – ముందే సూచనలు?
అక్టోబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ లోని నౌగాం ప్రాంతంలో “కమాండర్ హంజుల్లా భాయ్” అన్న పేరుతో పోస్టర్లు కనిపించాయి. దీంతో ఈ టెరర్ నెట్‌వర్క్ అప్పటికే యాక్టివ్‌గా ఉన్నట్లు అనుమానాలు మరింత బలపడ్డాయి. దర్యాప్తులో మరో షాకింగ్ అంశం బయటపడింది. ముజమ్మిల్‌ను ఈ హ్యాండ్లర్ షోపియన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం. ఈ మత గురువు యువ డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేసి “వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్” నిర్మించాడని అధికారులు చెబుతున్నారు.
ఐసిస్‌తో కూడా సంబంధం
అధికారుల ప్రకారం, ముజమ్మిల్‌కి 2021–2022 మధ్య అన్సర్ గజ్‌వత్ ఉల్ హింద్ అనే ఐసిస్‌కు చెందిన గ్రూప్‌తో సంబంధాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 2023-2024లో ఆయుధాలు కొనుగోలు చేసి స్వతంత్ర టెరర్ సెల్ ఏర్పాటు చేయాలనే ప్లాన్ చేశాడు. దర్యాప్తులో భాగంగా 360 కిలోల పేలు పదార్థాలు, 20 క్వింటాళ్ల ఎన్‌పీకే ఫర్టిలైజర్ లభ్యమయ్యాయి.
ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది.. విదేశీ టెరర్ హ్యాండ్లర్స్, డబ్బు మార్గాలు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లను గుర్తించే పనులు కొనసాగుతున్నాయి. దర్యాప్తు ఏజెన్సీలు ఇది ఒక పెద్ద అంతర్జాతీయ ఉగ్ర కుట్ర అని భావిస్తున్నాయి.


