పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు… అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.  

Kolkata Earthquake : పశ్చిమ బెంగాల్ లో కొద్దిసేపటిక్రితమే భూకంపం సంభవించింది. రాజధాని కోల్‌కతా నగరంతో పాటు వివిధ జిల్లాల్లో భూమి కంపించింది. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసులకు, పిల్లలు స్కూళ్లకు, వ్యాపారులు పనులపై బయటకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలోనివారు బయటకు… బయటే ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు పరుగుతీశారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. 

ఉదయమే భూకంపం

దాదాపు 4-5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి ప్రజలు చాలా భయపడ్డారు. మొదట ఏమీ అర్థం కాక కంగారుపడిపోయారు… వాళ్లు గుర్తించేలోపు ప్రకంపనలు ఆగిపోయాయి. కోల్‌కతాతో పాటు దక్షిణ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు కంపించాయి. ఉదయం 10:10 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి.

పశ్చిమ బెంగాల్ లోని ఈ ప్రాంతాల్లో భూకంపం

కోల్‌కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, దక్షిణ దినాజ్‌పూర్, కూచ్‌బెహార్, మాల్దా, నదియాతో పాటు పలు జిల్లాల ప్రజలు ఒక్కసారిగా ప్రకంపనలు ఫీలయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోనే కాదు ఈ రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా భూకంపం వచ్చింది. తాము 5-6 సెకన్ల కన్నా ఎక్కువ సేపు ప్రకంపనలు ఫీలయ్యామని కోల్‌కతా వాసులు చెప్తున్నారు. ఉదయాన్నే వచ్చిన ఈ భూకంపంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసింది. 

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నుంచి ఇంకా పూర్తి సమాచారం రాలేదు. అయితే ప్రకంపనలు కొద్దిసేపే ఉన్నా, చాలా చోట్ల స్పష్టంగా కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పెద్దగా నష్టం జరిగినట్టు ఇప్పటివరకు సమాచారం లేదు. అయినా, అధికారులు పరిస్థితిని గమనిస్తున్నట్టు తెలిసింది.