భారత్‌లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకువస్తూ చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని… కొన్ని వ్యాక్సిన్లకు కూడా లొంగడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  

Covid 19: మళ్ళీ భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మే 19 నాటికి దేశంలో కేవలం 327 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉండేవి… కానీ వారం రోజుల్లోనే ఈ సంఖ్య 1009 కి చేరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

కొత్తగా కరోనా JN.1 వేరియంట్ నుండి పుట్టుకొచ్చిన కొత్త ఓమిక్రాన్ సబ్-వేరియంట్లు NB.1.8.1, LF.7 లు వేగంగా వ్యాప్తిచెందే లక్షణాలు కలిగివున్నాయని నిపుణులు అంటున్నారు. తమిళనాడులో NB.1.8.1, గుజరాత్‌లో LF.7 వేరియంట్ కేసులు కనిపిస్తున్నాయి. ఈ రెండు వేరియంట్లు JN.1 సబ్-వేరియంట్లు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత్‌లో కనిపిస్తున్న కొత్త వేరియంట్లను ఇంకా 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్'గా పరిగణించలేదు. ఇవి మునుపటి వాటికంటే చాలా వేగంగా వ్యాపిస్తాయని, వ్యాక్సిన్ ఇచ్చే రక్షణని కూడా తప్పించుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి ఇంకా తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాలేదు. ఎక్కువ మందిలో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఇంకా ఆరోగ్య శాఖకు పెద్దగా కలవరపెట్టే విషయం కాదు.

లక్షణాలేంటి?

కొత్త వేరియంట్ల లక్షణాలు మునుపటి ఓమిక్రాన్ వేరియంట్ లాంటివే. జ్వరం, గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, తలనొప్పి వంటివి కనిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లో, ఆకలి లేకపోవడం, వాంతులు వంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా మందికి రుచి, వాసన పోయేవి. కానీ ఈ కొత్త వేరియంట్లలో ఆ లక్షణాలు కనిపించడం లేదు. ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరకుండానే కొద్ది రోజుల్లో కోలుకుంటున్నారు.