టెక్నాలజీని అవకాశంగా చూడాలని… ధైర్యం కోల్పోవద్దని, ఆరోగ్యకరమైన పోటీని అలవర్చుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యువతకు సూచించారు. ఏఐ రాకతో ఉద్యోగాలు తగ్గడం కాదు పెరుగుతాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గోరఖ్‌పూర్. ఈ రోజుల్లో యువత ముందు రెండు పెద్ద సవాళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఒకటి మాదరద్రవ్యాల వ్యసనం, రెండోది మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్ వ్యసనం. ఈ రెండు వ్యసనాలకు యువత దూరంగా ఉండకపోతే అది వారి భవిష్యత్తుకు, కుటుంబానికి, దేశానికి హానికరం అని ఆయన హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే యువత తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించగలరని సీఎం యోగి అన్నారు.

యువతకు అప్రమత్తంగా ఉండాలి

మహాయోగి గోరఖ్‌నాథ్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన మహారాణా ప్రతాప్ శిక్షా పరిషత్ 93వ వ్యవస్థాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షత వహించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మాదకద్రవ్యాల మాఫియా నిరంతరం యువతను తమ వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుందని… అందుకే యువత, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని సీఎం యోగి అన్నారు. దేశ శత్రువులు ఏదో ఒక రూపంలో సమాజంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని… వారికి అవకాశం ఇవ్వొద్దని యువతకు పిలుపునిచ్చారు.

మితిమీరిన ఫోన్ వాడకం వద్దు

స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి యోగి యువతకు సూచించారు. మొబైల్ ఎక్కువగా వాడటం కంటి చూపుపై ప్రభావం చూపుతుందని.. ఇది మెదడును మొద్దుబారేలా చేస్తుంది, ఆలోచనా శక్తిని బలహీనపరుస్తుందన్నారు. ఎక్కువ స్క్రీన్ టైమ్ మానసిక, శారీరక సామర్థ్యాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అవసరమైతేనే మొబైల్ వాడాలని, అది కూడా గంటకు మించి ఉండకూడదని సీఎం సూచించారు. నెమ్మదిగా ఈ అలవాటును నియంత్రించుకోవాలన్నారు.

టెక్నాలజీ కొత్త ఉపాధి అవకాశాలు

భవిష్యత్ సవాళ్లకు యువతను సిద్ధం చేస్తూ ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ అనే కొత్త శకంలోకి ప్రవేశించిందని సీఎం యోగి అన్నారు. టెక్నాలజీకి భయపడకూడదని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించదు, కొత్త ఉద్యోగాలను, కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీలకు అనుగుణంగా మనం మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సూచించారు.

ధైర్యం, ఓర్పు, సానుకూల దృక్పథంతోనే విజయం 

జీవితంలో ధైర్యం కోల్పోని వాడే గెలుస్తాడని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతికూల ఆలోచనలు ఓటమి వైపు నడిపిస్తాయి… అందరూ కలిసి 'కలిసి దీపం వెలిగిద్దాం' అనే స్ఫూర్తితో ముందుకు సాగితే చీకటికి చోటు ఉండదన్నారు.

షార్ట్‌కట్‌తో కాదు, కష్టపడితేనే విజయం

ఆరోగ్యకరమైన పోటీ, టీమ్ వర్క్ జీవితంలో ముఖ్యమైన భాగాలని సీఎం యోగి అన్నారు. షార్ట్‌కట్ ఎప్పటికీ శాశ్వత విజయాన్ని ఇవ్వదన్నారు. టెక్నాలజీ ఎన్ని సౌకర్యాలు ఇస్తుందో, అన్ని కొత్త సవాళ్లను కూడా తెస్తుందని… దీనికి యువత, విద్యాసంస్థలు సిద్ధంగా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ సూచించారు.