Indigo Crisis: రామ్మోహన్ నాయుడికి క్షమాపణలు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమన్నారంటే.
Indigo Crisis: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఈ విషయంపై ఇండిగో సీఈఓ స్పందించారు.

దేశవ్యాప్తంగా విమానాల రద్దు కలకలం
దేశవ్యాప్తంగా ఇండిగో కంపెనీ ఒకేసారి వందల కొద్దీ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయాల్లో భారీగా క్యూలైన్లు, ఎలాంటి సమాచారం లేకపోవడం, లగేజ్ సమస్యలు విపరీతమైన గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితిపై ఇండిగో సీఐఓ పీటర్ ఎల్బర్స్ స్వయంగా స్పందిస్తూ, “ప్రయాణికులను నిరాశపరిచామని అంగీకరిస్తున్నాం” అని క్షమాపణ చెప్పారు.
కంపెనీ ఇచ్చిన వివరణ
ఇండిగో కార్యకలాపాల్లో అనూహ్యంగా వచ్చిన పెద్ద సమస్యల వల్ల విమాన రద్దులు జరిగాయని కంపెనీ చెబుతోంది. పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ.. “విమాన ప్రయాణం ప్రజలను వారి లక్ష్యాలకు చేరుస్తుంది. ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోవడం మాకు కూడా బాధాకరమే” అని తెలిపారు. కంపెనీ శక్తివంచన లేకుండా పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
రద్దయిన విమానాల రీఫండ్
ఇండిగో ఇప్పటికే రద్దయిన విమానాల కోసం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే రీఫండ్ చెల్లింపులు ప్రారంభించింది. చాలా మంది ప్రయాణికులకు డబ్బు ఇప్పటికే అందింది. ప్రతి రోజు రీఫండ్ ప్రాసెస్ కొనసాగుతోంది. అలాగే 780 మంది ప్రయాణికుల లగేజ్ ఇంకా తిరిగి అందలేదు, అయితే అందులో 90% వరకు బుధవారం ఉదయానికి పంపిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం నేరుగా పర్యవేక్షిస్తోంది.
ముంబై–కోల్‌కతా విమానాశ్రయాల్లో ప్రభుత్వ పరిశీలనలు
ముంబై విమానాశ్రయం ఇప్పటికే కెపాసిటీ సమస్యలతో ఉండగా, ఇండిగో రద్దులు మరింత ఒత్తిడిని పెంచాయి.
దీంతో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మధుసూదన్ శంకర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నేరుగా పరిశీలనలు చేసి ఇండిగో అధికారుల నుంచి వివరణ కోరారు. ప్రభుత్వం విమానాశ్రయాలకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది:
* ప్రయాణికులకు తాగునీరు, ఆహారం, సీటింగ్ ఏర్పాటు తప్పనిసరి
* వైద్య సహాయం, PRM సపోర్ట్ మెరుగుపరచాలి
* CISF సహకారాన్ని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది
అదేవిధంగా, కోల్‌కతా విమానాశ్రయంలో కూడా కార్యకలాపాల నిర్వహణ, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, రద్దుల నిర్వహణపై పూర్తి స్థాయి పరిశీలన చేపట్టింది MoCA టీమ్.
సాధారణ స్థితికి ఎప్పుడు?
ప్రభుత్వం జోక్యం, విమానాశ్రయాల్లో అదనపు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ, ఇండిగో పూర్తిగా సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత లేదు. రానున్న రోజుల్లో సమస్యలు తగ్గుతాయా లేదా మరింత తీవ్రం అవుతాయా అన్న ఆందోళన మాత్రం కొనసాగుతోంది. ఈ మొత్తం గందరగోళంపై పీటర్ ఎల్బర్స్ మంత్రిత్వ శాఖకు క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన స్పష్టంగా ఒప్పుకున్నారు. పరిస్థితిని సాధారణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, విమానాశ్రయ నిర్వాహకులు, ఇండిగో కలిసి పనిచేస్తున్నాయి.

