వరకట్నంపై చట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు
కాలంతో పాటు అనేక మార్పులు రావడం సహజం. కానీ వరకట్నం విషయంలో ఎంతోమంది పోరాటం సాగించినా.. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వరకట్న నిషేధం గురించి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాల్లో మార్పులతో పాటు సామాజికంగా ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటి వాటిని రూపుమాప గలుగుతామని సుప్రీం ధర్మాసనం పేర్కోంది.
వరకట్నం విషయంలో దేశంలో ఇప్పటికీ చాలా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వరకట్నం కారణంగా ఆడపిల్లల పెండ్లి చేయడంలో సమస్యలతో పాటు, వివాహం చేసిన తర్వాత కూడా వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. విడిపోయిన జంటలు అధికమే. ప్రభుత్వాలు వరకటర్న నిషేధం కోసం చట్టాలు చాలానే తీసుకువచ్చాయి. కానీ దీనిని నిర్మూలించడంలో విఫలమయ్యాయి. వరకట్న విషయంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం సామాజిక సమస్య అనీ, సంఘంలో మార్పు వస్తేనే ఇది పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టులకు పరిమితులు ఉంటాయని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
Also Read: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు
వరకట్నం సమస్య నిరోధానికి సంబంధించి మూడు సూచనలు చేస్తూ కేరళకు చెందిన సబు సెబాస్టియన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతి, 1961లో వరకట్న నిషేధ చట్టం రూపంలో కొత్త చట్టం మరియు జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, భారత శిక్షాస్మృతిలో క్రూరమైన క్రిమినల్ చట్ట నిబంధనలను ప్రవేశపెట్టినప్పటికీ వరకట్నం ఇంకా కొనసాగుతున్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది వీకే.బిజూ కేరళ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. వరకట్నం ప్రభావం ఎంతగా ఉందో, దేశంలోనే అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో కూడా భర్త కుటుంబీకులు బంగారం కోసం యువతులను చంపేస్తున్నారని పేర్కన్నారు. పెళ్లిళ్లలో మహిళలను ఆబ్జెక్ట్ చేస్తూ వరకట్నం తీసుకుంటున్న పరిస్థితులను గురించి సుప్రీంకోర్టుకు వివరించారు. వరకట్న నిషేధానికి సంబంధించి దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలను జీవితాలు వరకట్నం కారణంగా ఎలా నాశనం అవుతున్నాయనే విషయాన్ని బిజూ ఎత్తి చూపారు. పిటిషన్ దారు చేసిన సూచనల్లో.. సమాచార హక్కు అధికారులు ఉన్న మాదిరిగా వరకట్న నిరోధక అధికారులు ఉండాలని, వివాహ సమయంలో మహిళకు ఇచ్చిన నగలు కనీసం ఏడేళ్లు వారి వద్దే ఉండేలా చూడాలని, వివాహానికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వడానికి పాఠ్యాంశాలు ఉండాలని పేర్కొన్నారు.
Also Read: రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు
ఈ నేపథ్యంలోనే స్పందించిన ధర్మాసనం కేవలం చట్టాలే కాదు, ప్రజలు కూడా మారాలనీ, వరకట్నం అనే సామాజిక దురాచారానికి సంబంధించి స్త్రీ పట్ల గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన విషయాన్ని, మరింత కఠినంగా చేయాల్సిన అంశాలను లా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంది. ‘‘ వరకట్నం లేకుండా చర్యలు తీసుకోవాలి. దీని కోసం చట్టాల్లో మార్పులు అవసరమే. అయితే, చట్టాల్లో మార్పుల మాదిరిగానే సమాజంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మొదట సంఘంలో మార్పులు వస్తే వరకట్నం అనే భూతం తొలగిపోతుంద’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, సమజాంలో మహిళలను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని కుటుంబంలోకి ఆహ్వానించాలి అన్నదానిపై కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నదని న్యాయస్థానం పేర్కొంది. వరకట్న దురాచారం మొత్తం వివాహ వ్యవస్థపైనే ప్రభావం చూపుతున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Also Read: దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. కానీ..