మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు దేశంలో మరింతగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటం కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నది. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి ఆచూకీ లభించకుండా పోవడంతో కలవరం మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 100 మంది ఆచూకీ లేదని తాజాగా మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్ కలవరం రేపుతూనే ఉంది. కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో భయాందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కేసులు భారత్ క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారిపై దృష్టి సారించారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర అధికారులు.. విదేశాల నుంచి వచ్చిన వారిలో దాదాపు 100 మంది కనిపించకుండా పోయారని వెల్లడించడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ విజయ్ సూర్యవంశీ మీడియాతో మాట్లాడుతూ థానే జిల్లాలోని టౌన్‌షిప్‌కి ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన 295 మందిలో 109 మంది ఆచూకీ అందుబాటులో లేదని తెలిపారు. వీరిలో కొందరి మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయన్నారు. అలాగే, వారు ఇచ్చిన ఇంటి చిరునామాలు కొన్ని మూసివేసి ఉండగా, మరికొన్ని తప్పుడు చిరునామాలు ఉన్నాయని తెలిపారు. ఇక కరోనా రిస్క్ అధికంగా ఉన్న దేశాలు పరిగణిస్తున్న ఆఫ్రికా దేశాలతో పాటు విదేశాల నుంచి KDMC పరిధిలోకి వస్తే.. తప్పని సరిగా వారం రోజుల పాలు క్వారంటైన్ ఉండాలని తెలిపారు. 8వ రోజు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించబడతాయని సూర్యవంశీ తెలిపారు.
Also Read: రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు
ప్రస్తుతం పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటించడం అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ ఉండటం అనేది ప్రతికూలంగా అనిపించినా.. ఈ విపత్కర పరిస్థితుల్లో తప్పదు. ఏడు రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సిందే. కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకోవడం హౌసింగ్ సొసైటీ సభ్యుల విధి అని సూర్యవంశీ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహాలు, ఇతర సమావేశాలు నిర్వహించడం వల్ల సంభవించే పరిస్థితుల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. కరోనా టీకాలు ప్రజలకు అందించిన వివరాలు గురించి సైతం ఆయన మాట్లాడారు. కేడీఎంసీలో ఇప్పటివరకు మొత్తం 72 శాతం మంది ప్రజలు కరోనా టీకా మొదటి డోసును తీసుకున్నారని తెలిపారు. అలాగే, 52 శాతం మందికి పూర్తి టీకాలు (రెండు డోసుల కరోనా టీకాలు) వేశామని తెలిపారు. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇటీవలే డోంబివాలి ప్రాంతంలో ఒకటి నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను సైత వేగవంతం చేశామని తెలిపారు.
Also Read: గోవా ఎన్నికల్లో టీఎంసీతో ఎంజీపీ దోస్తాన్ !
రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తమైంది. ఇప్పటికే అనేక చర్యలను ప్రారంభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కరోనావైరస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. రాష్ట్రంలో ఆంక్షలను తిరిగి విధించడంపై ఏదైనా నిర్ణయం కేంద్రం ప్రభుత్వ మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అభిప్రాయాలను కోరిన తర్వాత మాత్రమే తీసుకోబడుతుందని తెలిపారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో సంబంధం ఉన్న కేసులను గుర్తించడంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో అనుమతించబడిన కార్యకలాపాలపై పరిమితులు విధించడం ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంటుందని తోపే అన్నారు. "ప్రస్తుతం అనుమతించబడిన కార్యకలాపాలపై ఆంక్షలు విధించినట్లయితే ఇది ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల, మేము పరిస్థితి గమనిస్తున్నాం. కేంద్రం, (రాష్ట్ర కోవిడ్-19) మార్గదర్శకాలను అనుసరించి ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటాం" అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ వల్ల కలిగే పరిస్థితిని ఎదుర్కొంటూనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు టీకాలు వేయడంపై దృష్టి సారిస్తోందని మంత్రి చెప్పారు.
Also Read: భారత్, రష్యా మధ్య పలు రక్షణరంగ ఒప్పందాలు