దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. కానీ..
భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. దాదాపు 18 నెలల కనిష్టానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. దేశంలో ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుతున్నాయి.
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు క్రమంగా పెరుగుతన్నాయి. అయితే, భారత్‌లో సాధారణ కరోనా వేరియంట్ కొత్త కేసులు భారీ స్థాయిలో తగ్గిపోవడం ఊరట కలిగిస్తున్నది. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ ప్రస్తుత వివరాలను వెల్లడించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 18 నెలల కనిష్టానికి పడిపోయాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొత్త కేసులతో కలుపుకుని భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,48,383కు చేరింది. ప్రస్తుతం 95,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోపక్క క్రియాశీల కేసులు 554 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ఇప్పటివరకు మొత్తం 3,40,79,612 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. సోమవారం ఒక్కరోజే 10,004 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Also Read: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో పోరాడుతూ 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,73,757కు పెరిగింది. కొత్తగా నమోదైన మరణాల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. వారంతపు కరోనా పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 64,82,59,067 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 8,86,263 కరోనా వైరస్ శాంపిళ్లను పరిశీలించినట్టు తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచారు. దేశంలో మొత్తం 128.8 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో 80.3 కోట్ల మొదటి డోసులు ఉండగా, రెండు డోసుల తీసుకున్న వారి సంఖ్య 48.5 కోట్లకు చేరింది. కాగా, దేశంలో కరోనా టీకాలు తీసుకోవడానికి అర్హులైన వారిలో సగం మందికి రెండు డోసుల కోవిడ్ టీకాలు అందించామని సోమవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read: రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు
ఇదిలావుండగా, కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మన దేశంలో పెరుగుతుండటం పై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. అయినప్పటికీ.. ఇటీవల పలు దేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వారి ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో వందల మంది కనిపించకుండా పోయారు. మహారాష్ట్ర 100 మందికి పైగా కనిపించడం లేదని మంగళవారం నాడు కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ విజయ్ సూర్యవంశీ మీడియాతో అన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ లోనూ వందల సంఖ్యలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి ఆచూకీ లేదు. వీరిని గుర్తించాడానికి అధికారులు ప్రత్యేక బృందాలను సైత ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: గోవా ఎన్నికల్లో టీఎంసీతో ఎంజీపీ దోస్తాన్ !