ఈశాన్య భ్యారత దేశంలో బీజేపీకి ప్రధాన మిత్రపక్షం ఎజిపి షాక్ ఇచ్చింది. సవరించిన పౌరసత్వ చట్టానికి ఉభయసభల్లోనూ మద్దతు ఇచ్చిన ఈ బిజెపి మిత్రపక్షం ఇప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది. 

పార్టీ సీనియర్ నాయకుల సమావేశం తరువాత అసోమ్ గణ పరిషత్ (ఎజిపి) శనివారం తన వైఖరిని ప్రకటించింది. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ ఇప్పుడు నిర్ణయించింది.

ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలవాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వంలో ఎజిపి భాగం, రాష్ట్ర మంత్రివర్గంలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.

Also read: జేడీయూ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజీనామా... నెక్స్ట్ ఏంటి?

పార్లమెంటులో సవరించిన పౌరసత్వ చట్టానికి అసోమ్ గణ పరిషత్ తన మద్దతును అందించింది, కాని ఈ చర్య పాలక కూటమిలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది, ప్రజల పరిస్థితిని అంచనా వేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆరోపిస్తూ అనేక మంది పార్టీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసారు. 

అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు జగదీష్ భూయాన్ పార్టీ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.

పొరుగు దేశాల నుండి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా రాష్ట్ర ఫిల్మ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిన అస్సామీ సూపర్ స్టార్ జతిన్ బోరా గురువారం బిజెపికి రాజీనామా చేశారు. 

"నేను CAB ని అంగీకరించను. జతిన్ బోరా అనే నా గుర్తింపు అస్సాం ప్రజల కారణంగా... ఈ విషయంపై నేను వారితోపాటుగా ఉన్నాను" అని ఆయన అన్నారు. ఇటీవలే "రత్నాకర్" అనే హిట్ చిత్రంలో నటించిన బోరా 2014 లో బిజెపిలో చేరారు.

Also read: పౌరసత్వ సవరణ చట్టం.. ‘టీ’ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి

కొద్ది రోజుల క్రితం రాష్ట్రానికి చెందిన మరో ప్రముఖ నటుడు రవిశర్మ కూడా బిజెపి నుంచి తప్పుకున్నారు. అస్సామీ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సభ్యులు ఈ బిల్లుపై తమ వ్యతిరేకతను, నిరసనను వ్యక్తం చేశారు.

ఈశాన్య భారతంలో, ముఖ్యంగా అస్సాంలో కర్ఫ్యూను ధిక్కరించి మరీ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పోలీసులకు నిరసనకారులు మధ్య మినీ సంగ్రామమే నడిచింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించారు, పౌరసత్వం (సవరణ) బిల్లును పార్లమెంటు బుధవారం నాడు ఆమోదించి, మరుసటి రోజే  చట్టంగా చేసినప్పటినుండి హింసాత్మక నిరసనలు మొదలయ్యాయి. 

పశ్చిమ బెంగాల్‌కు కూడా ఈ ఆందోళనలు పాకాయి.  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ లు ఇద్దరూ ప్రజలను శాంతితో మెలగాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, నిరసనకారులు మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో కనపడడం లేదు.