పాట్నా: కేవలం ఎన్నికల వ్యూహకర్తగా మాత్రమే ప్రజలకు సుపరిచితమైన ప్రశాంత్ కిషోర్... నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ వ్యాఖ్యలకు మాత్రం దూరంగా ఉండేవారు. 

కానీ ఇప్పుడు ఆయన పొరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా తీసుకున్న వైఖరి మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పౌరసత్వ చట్టంపై తన పార్టీ వైఖరికి విరుద్ధ వైఖరి తీసుకున్న జనతాదళ్-యునైటెడ్ (జెడియు) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ శనివారం పార్టీ చీఫ్ నితీష్ కుమార్ కు రాజీనామా లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది. కానీ కిషోర్ రాజీనామాను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఆమోదించలేదు.

పౌరసత్వం (సవరణ) చట్టంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రశాంత్ కిషోర్ తన ట్విట్టర్ బయో నుండి పార్టీ పేరును కూడా తొలగించారు. ఇందాక కొద్దిసేపటికింద నాట్ గివింగ్ అప్ అనే హ్యాష్ ట్యాగ్ తో మరో ట్వీట్ కూడా చేసాడు. 


జెడి-యు చీఫ్ కుమార్‌ను కలిసిన తరువాత, కిషోర్ మాట్లాడుతూ...  "మేము నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు అనుకూలంగా లేమని నితీష్ కుమార్ చెప్పారు. పౌరసత్వం (సవరణ) చట్టంతో ఎటువంటి సమస్య లేదు, కానీ ఈ రెండిటి కాంబో మాత్రం ప్రజల్లో మరింత వివక్షకు దారితీస్తుంది  "

ఇక వారి సమావేశానికి ముందు, పౌరసత్వ చట్టంపై తన వైఖరిపై తాను వెనక్కి తగ్గబోనని కిషోర్ విలేకరులతో అన్నారు. "నేను బహిరంగంగా చెప్పాను, నితీష్ కుమార్ కోసం మాత్రమే కాదు, అందరి ముందు నా వైఖరిని స్పష్టపరిచాను" అని ఆయన అన్నారు.

Also read: గౌతమ్ గంభీర్ ఆశలపై ప్రశాంత్ కిషోర్ నీళ్లు

డిసెంబరు 11 న రాజ్యసభలో పౌరసత్వం (సవరణ) బిల్లు ఆమోదించబడటానికి ఒక రోజు ముందు, పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇచ్చే నిర్ణయాన్ని పుణఃపరిశీలించాలని కిషోర్ తన పార్టీని కోరారు.

బీహార్‌లో బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జేడీయూ, పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది.

రాజ్యసభ ఆమోదం పొందిన తరువాత, పౌరసత్వం (సవరణ) బిల్లు డిసెంబర్ 12 న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్రతో ఒక చట్టంగా మారింది.

తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ, కిషోర్ మాత్రం పౌరసత్వ చట్టాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. శుక్రవారం, బిజెపియేతర పాలనలో ఉన్న రాష్ట్రాలు తమ వైఖరిని క్లియర్ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని ఆయన ఒక పిలుపునిచ్చారు.

"పార్లమెంటులో బీజేపీ మెజారిటీ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ బిల్ పాసయ్యింది. ఇప్పుడు న్యాయవ్యవస్థకు మించి, భారత ఆత్మను రక్షించే పని 16 బిజెపియేతర సిఎంలపై ఉంది, ఎందుకంటే ఈ చర్యలను ఆచరణలో పెట్టాల్సింది రాష్ట్రాలే అని ఆయన ఒక ట్వీట్ చేశారు.