గువాహటి: పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్) సెగ అసోం టీ పరిశ్రమకు తగులుతున్నది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు చాలా టీ తోటల్లో ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్నాయి. చివరకు గువాహటి తేయాకు వేలం కేంద్రం వద్ద లావాదేవీలూ నిలిచిపోయాయి. 

తేయాకు సరఫరాలో సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘శీతాకాలంలో ఎక్కువ డిమాండ్ ఉండకున్నా చాలా తోటల్లో ఆకు సేకరణ, ఇతరత్రా ఉత్పాదక కార్యకలాపాలు ఈ ఆందోళనల వల్ల ప్రభావితమవుతున్నాయి’ అని ఈశాన్య టీ అసోసియేషన్ సలహాదారు బైద్యనాద బార్కకోటి పీటిఐతో అన్నారు. 

నిజానికి గత కొన్నేళ్లతో పోల్చితే ఈ డిసెంబర్‌లో పరిస్థితులు టీ పరిశ్రమకు అనుకూలంగా ఉన్నాయి. నాణ్యమైన తేయాకు ఉత్పత్తి అవుతున్నది. కానీ బంద్‌లు, నిరసనలతో ఉత్పాదక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతున్నదని తేయాకు వ్యాపారులు అంటున్నారు. 
‘మంగళవారం బంద్‌తో అన్ని తోటలు మూతబడ్డాయి. మళ్లీ శుక్రవారం ఆకు సేకరణ మొదలైంది. కానీ రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పూర్తిస్థాయిలో కార్మికులు రాలేకపోతున్నారు’ అని అసోం చిన్నతరహా టీ తోటల నిర్వహణదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కరుణ మహ్నాట పీటీఐకి తెలిపారు. 

భారీగా ఆందోళనలు చెలరేగుతుండటంతో పోలీసులు కర్ఫూ విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, కార్మికుల కొరత కారణంగా ఈ నెల 19 వరకు ఆకు సేకరణ సమయాన్ని టీ బోర్డు పొడిగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నిజానికి నాణ్యమైన తేయాకు కోసం ఈ నెల మధ్య నాటికే ఆకు సేకరణ ఆపేయాలని టీ బోర్డు స్పష్టం చేసింది. 

ఇదిలావుంటే నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు కూడా తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హింసాత్మక ఘటనలు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సర్వీసులను పోలీసులు ఆపేస్తున్నారు. దీంతో కార్మికులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని వ్యాపారులు అంటున్నారు. 
‘ప్రతీ వారం గువాహటి టీ వేలం కేంద్రంలో దాదాపు 40-45 లక్షల కిలోల తేయాకు అమ్ముడయ్యేది. కానీ ఈ వారంలో ఇప్పటిదాకా 15 లక్షల కిలోల అమ్మకాలే జరిగాయి’ అని గువాహటి టీ వేలం కొనుగోలుదారుల సంఘం కార్యదర్శి దినేశ్ బిహానీ అన్నారు.

అడ్డుకోవద్దని ఆందోళనకారులకు ఆయిల్ ఇండియా అప్పీల్ చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగించొద్దని ఆందోళన కారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) విజ్ఞప్తి చేసింది. దీనివల్ల సామాన్యులకూ సమస్యలు తప్పవని గుర్తుచేసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో సంస్థ ఈ మేరకు బహిరంగ ప్రకటన ఇచ్చింది. 

రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సహజ వాయువు వినియోగదారులకు, రిఫైనరీలకు ముడి చమురు సరఫరా నిలిచి రిటైల్ మార్కెట్‌లో అన్ని రకాల ఇంధన ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతుండగా, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీవ్ర సంక్షోభం ఖాయమని ఆయిల్ ఇండియా హెచ్చరించింది.