అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్ పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ ను తీవ్రంగా వ్యతిరేకింది. ఈ మేరకు ఆ పార్టీ ఏకగీవ్రంగా తీర్మానాన్ని ఆమోదించింది.
అరుణాచల్ ప్రదేశ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలును ఆ రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) వ్యతిరేకించింది. ఈ మేరకు శనివారం ఇటానగర్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పక్ంగా బాగే తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్ పీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లిఖా సాయా మీడియాతో మాట్లాడారు.
ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్ పై వివాదాస్పద పోస్టు.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు
అభివృద్ధి సమస్యలపై ఎన్ పీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, తమ పార్టీ దాని సొంత భావజాలాన్నే అనుసరిస్తుందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ కు దాని సొంత ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని, అయితే కొన్ని మార్పులు చేస్తూ సంప్రదాయ చట్టాలతో వెళ్లాలని ఎన్ పీపీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిందని బాగే చెప్పారు.
ప్రస్తుతం ఉన్న ఆచార చట్టాలను గిరిజన ఆచారాలకు అనుగుణంగా అవసరమైన మార్పులతో క్రోడీకరించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. పాత పెన్షన్ పథకాన్ని తిరిగి పెట్టాలని, కొత్త పెన్షన్ పథకాన్ని (ఎన్ పీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించిందని తెలిపారు.
తమ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు 2024లో జరగబోయే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేస్తాయని అన్నారు. ఎన్పీపీ లౌకిక పార్టీ అని, ఏ వ్యక్తిపైనా, మత సమూహంపైనా పక్షపాతం చూపదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తమ ఏకైక లక్ష్యమని సాయా తెలిపారు. కాగా.. 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎన్పీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ వరదలు.. చూస్తుండగానే బియాస్ నదిలో కొట్టుకుపోయిన కారు.. వీడియో వైరల్
యూనిఫాం సివిల్ కోడ్ అనేది మతం, తెగ లేదా ఇతర స్థానిక ఆచారాలతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వంపై అనే అంశాలపై ఒకే ఉమ్మడి చట్టాలను సూచిస్తుంది. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ప్రజా, గుర్తింపు పొందిన మత సంస్థలు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ లా కమిషన్ జూన్ 14న సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.
