ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్ పై వివాదాస్పద పోస్టు.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్ ను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు రావడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించారు.,
ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పై ఇండోర్ లోని తుకోగంజ్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండోర్ కు చెందిన హైకోర్టు న్యాయవాది రాజేష్ జోషి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 153-ఏ, 469, 500, 505 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మాజీ ఎంపీ సీఎం అధికారిక సోషల్ మీడియా ఐడీ నుంచి వెలువడిన ఓ పోస్ట్ ఆర్ఎస్ఎస్ రెండో చీఫ్ ను కించపరిచేలా ఉందని, అందులో గోల్వాల్కర్ దళితులు, వెనుకబడినవారు, ముస్లింల సమాన హక్కులకు వ్యతిరేకమని పేర్కొన్నారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ ఆర్ఎస్ఎస్ చీఫ్ గోల్వాల్కర్ పై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను ఆపాదించడం ద్వారా, మాజీ సీఎం ఉద్దేశపూర్వకంగా దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాలలో ఆర్ఎస్ఎస్ పట్ల ద్వేషాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించారని, వివిధ వర్గాల మధ్య సంఘర్షణ, శత్రుత్వాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో న్యాయవాది ఆరోపించారు.
గోల్వాల్కర్ చెప్పినట్టుగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్న ఫొటోను దిగ్విజయ్ సింగ్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అందులో ‘‘దళితులు, వెనుకబడినవారు, ముస్లింలకు సమాన హక్కులు కల్పించడం కంటే బ్రిటీష్ పాలనలో జీవించడమే నాకు ఇష్టం’’ అని గోల్వాల్కర్ తెలుపుతున్నట్టు ఉంది.
హిమాచల్ ప్రదేశ్ వరదలు.. చూస్తుండగానే బియాస్ నదిలో కొట్టుకుపోయిన కారు.. వీడియో వైరల్
కాగా.. దిగ్విజయ్ సింగ్ పై ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఫొటోషాప్ చేసిన ఫొటోను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పోస్ట్ చేశారని ఆరోపించింది. ఇది నిరాధారమైనదని, సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆరెస్సెస్ సీనియర్ నేత సునీల్ అంబేకర్ అన్నారు.