Asianet News TeluguAsianet News Telugu

మహా అయితే మోడీని దింపేస్తారు, కానీ..! బీజేపీపై ప్రశాంత్ కిశోర్ అంచనా ఇదే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీజేపీపై సంచలన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రజలు ఆగ్రహావేశాలతో మహా అయితే నరేంద్ర మోడీని గద్దె దింపుతారేమోకానీ, బీజేపీ స్థానం చెక్కుచెదరదని వివరించారు. వచ్చే మరికొన్ని దశాబ్దాలపాటు భారత రాజకీయాల్లో బీజేపీ కేంద్రస్థానంలో కొనసాగుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఈ విషయంలోనూ పొరబడుతుంటారని అన్నారు.
 

bjp to remain in indian politics for decades says prashan kishor
Author
New Delhi, First Published Oct 28, 2021, 3:21 PM IST

న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో Prashant Kishor కు విశిష్ట గుర్తింపు ఉన్నది. ఆయనను నమ్ముకున్న పార్టీలు ఎక్కువసార్లు అధికారాన్ని అందిపుచ్చుకోవడంతో ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు మంచి ఆదరణ ఉన్నది. ప్రతి పార్టీపై ఆయనకు కొన్ని అంచనాలు ఉన్నాయి. తాజాగా బీజేపీపై ఆయన అంచనాలను వెల్లడించారు. TMCకి వ్యూహాలు అందిస్తున్న ఆయన ఇటీవలే గోవా పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ BJPపై ఆయన అభిప్రాయాలు వెల్లడించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, ఓడినా కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కేంద్రస్థానంలో ఆ పార్టీ ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. కాంగ్రెస్‌కు దాని తొలి 40ఏళ్ల స్థితిలాగే ఇప్పుడు బీజేపీ కూడా దేశ రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతుందని వివరించారు. బీజేపీ ఎక్కడికి వెళ్లదు అని అన్నారు. ఒకసారి జాతీయ స్థాయిలో 30శాతం ఓట్లు పొందిన పార్టీ అంత త్వరగా కనుమరుగు కాదు అని స్పష్టం చేశారు.

Also Read: కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిశోర్ వైరం? ఆయన ట్వీట్ ఏం చెబుతున్నది?

అందుకే కొందరు చెబుతున్న ట్రాప్‌లో పడవద్దని చెప్పారు. ప్రజలందరిలోనూ ఆగ్రహావేశాలున్నాయని, భవిష్యత్‌లో వారంతా కచ్చితంగా మోడీని గద్దె దింపుతారని కొందరు చెబుతుంటారని అన్నారు. ఒకవేళ అదే నిజమైతే మహా అయితే మోడీ గద్దె దిగుతారేమో కానీ, బీజేపీ ఎక్కడికీ పోదు అని చెప్పారు. వచ్చే కొన్ని దశాబ్దాలపాటు బీజేపీపై పోరాడవల్సి ఉన్నదని తెలిపారు. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీనీ ప్రస్తావించారు. రాహుల్ గాంధీ అంచనాలు ఇక్కడే తప్పుగా ఉన్నాయని వివరించారు.

వచ్చే రోజుల్లో కచ్చితంగా ప్రజలు నరేంద్ర మోడీని ఇంటికి పంపుతారని రాహుల్ గాంధీ బలంగా విశ్వసిస్తారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాహుల్ గాంధీతో ఉన్న చిక్కే అది అని వివరించారు. ఆయన అనుకునేది జరగదని తెలిపారు.

మోడీ గురించి స్పష్టమైన అంచనాకు వేయాల్సి ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆయన బలాబలాలు పరిశీలించకుండా, అర్థం చేసుకోకుండా ఆయనను దీటుగా ఎదుర్కోలేమని వివరించారు. చాలా మంది ఆయన బలాలను సరిగా అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించడం లేదని తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఆయన ఎందుకు పాపులర్ అయ్యాడో తగిన కాలం కేటాయించి గుర్తించలేకపోవడమే అసలు సమస్య అని తాను భావిస్తున్నట్టు వివరించారు. అది తెలిస్తేనే ఆయనకు సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.

Also Read: టార్గెట్ 2024: నేనేమీ జ్యోతిష్యురాలిని కాను.. విపక్ష కూటమి నాయకత్వంపై మమత ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ నేత అజయ్ షెరావత్ ట్వీట్ చేశారు. భారత రాజకీయాల్లో బీజేపీ మరికొన్ని దశాబ్దాలపాటు సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నదని ఎట్టకేలకు ప్రశాంత్ కిశోర్ గుర్తించారని పేర్కొన్నారు. అమిత్ షా ఈ అంచనాలను ఇది వరకే వేసి ప్రకటించారని తెలిపారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవలే కాంగ్రెస్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనతోనే కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజితం చెందుతుందనుకోవడం పొరపాటేనని చురకలంటించారు. పార్టీలో లోతుగా పాతుకుపోయిన అనేక సమస్యలున్నాయని అన్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. కానీ, ఆ ట్వీట్‌తో ఆయన వైఖరి స్పష్టమైపోయింది. ప్రస్తుతం టీఎంసీకి వ్యూహకర్తగా ఇంకా కొనసాగుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios