BJP Leader Navneet Rana : సామూహిక అత్యాచారం చేసి చంపేస్తామంటూ మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు, అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపులు వచ్చాయి. ఆ లేఖలో అసభ్యకరమైన భాష వాడుతూ అభ్యంతరకరమైన విషయాలు రాశారు.
Navneet Rana receives life and assault threats : మహారాష్ట్ర బీజేపీ నేత, అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపు లేఖ వచ్చింది. స్పీడ్ పోస్టు ద్వారా వారి అమరావతి కార్యాలయ చిరునామాకు వచ్చిన లేఖతో తీవ్ర పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందులో అత్యంత అసభ్యమైన భాషను ఉపయోగిస్తూ, ప్రాణహాని,సామూహిక దాడి చేస్తామని హెచ్చరించారు. అలాగే, తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు.
ఈ బెదిరింపు లేఖ విషయం తెలిసిన వెంటనే నవనీత్ రాణా వ్యక్తిగత సహాయకుడు మంగేష్ కోకాటే రాజాపేఠ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.
బెదిరింపులు చేసిన వ్యక్తి గుర్తింపు.. పోలీసుల దర్యాప్తు
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, హైదరాబాద్‌కు చెందిన జావేద్ అనే వ్యక్తి ఈ లేఖను పంపినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని జాడను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. స్పీడ్ పోస్టు రికార్డుల పరిశీలన, పోస్టల్ ట్రాకింగ్ వివరాల ఆధారంగా అతని వివరాలు గుర్తించారు. అలాగే, సంబంధిత పోస్టాఫీసు CCTV ఫుటేజ్ సేకరించి, లేఖ, ఇంక్, రైటింగ్ స్టైల్‌పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుపుతున్నారు. అవసరమైతే సైబర్ నిపుణుల సహకారం కూడా తీసుకోనున్నట్టు సమాచారం.
అమరావతి క్రైమ్ బ్రాంచ్ అధికారులు రాణా ఇంటికి చేరుకుని, భద్రతా అంశాలపై సమీక్ష కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి చర్యలు వేగవంతం చేశారు.
నవనీత్ రాణా భద్రతపై ఆందోళనలు
నవనీత్ రాణాకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమెకు అనేకసార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఎంపీగా పనిచేసిన సమయంలో కూడా పలు సందర్భాల్లో ఆమె రక్షణపై ప్రశ్నలు తలెత్తాయి.
ఈసారి మరింత దారుణమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీపావళి అనంతరం వచ్చిన ఈ బెదిరింపు లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీ నేతలు నిందితుడిపై కఠిన చర్యను డిమాండ్ చేస్తున్నారు.
ఎవరీ నవనీత్ రాణా?
ఆమె అసలు పేరు నవనీత్ కౌర్ రాణా. పంజాబ్ కు చెందిన ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సినీ కెరీర్ లో తెలుగు, హిందీ, తమిళ, పంజాబీ చిత్రాలల్లో నటించారు. ఆమె రాజకీయ ప్రయాణం గమనిస్తే.. 2019లో అమరావతి SC రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 2024లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి బసవంత్ వాంఖడే చేతిలో ఓటమిపాలయ్యారు. రాజకీయంగా, ఆమె స్పష్టమైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. అదే కారణంగా పలు తీవ్రమైన ప్రతిస్పందనలు కూడా ఎదుర్కొంటుంటారు. ఈ కేసులో నిందితుడిని త్వరగా పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


