EPFO కొత్త రూల్స్ : పీఎఫ్ విత్‌డ్రా లో మార్పులు.. మీరు తప్పక తెలుసుకోవాల్సిందే !
EPFO New Rule : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పీఎఫ్ విత్‌డ్రా లో కీలక మార్పులు చేసింది. మూడు ప్రధాన పరిస్థితుల్లో మాత్రమే మీరు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

EPFO గుడ్ న్యూస్.. ఉద్యోగులకు పెద్ద ఊరట
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ పీఎఫ్ విత్‌డ్రా నియమాలలో పెద్ద మార్పులను ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ మార్పుల వల్ల ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ ఈపీఎఫ్ (EPF) ఖాతాల నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవడం మరింత సులభం అవుతుంది. పీఎఫ్ ఖాతాదారులు ఈ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, నిపుణులు కొన్ని కొత్త నియమాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక మూడు పరిస్థితుల్లోనే మనీ విత్ డ్రా
ఇంతకు ముందు పీఎఫ్ ఉపసంహరణకు 13 నిబంధనలు ఉండేవి. ఇప్పుడు వాటిని కేవలం మూడు విభాగాలుగా సులభతరం చేశారు. అవి ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు.
ముఖ్యమైన అవసరాలలో వైద్యం, వివాహం, విద్య మొదలైనవి ఉన్నాయి. గృహ అవసరాల కింద ఇల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించడం కోసం డబ్బును పీఎఫ్ ఖాతా నుంచి తీసుకొవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సభ్యులు కారణం చెప్పకుండానే డబ్బు తీసుకునే అవకాశం కల్పించారు.
విద్య కోసం 10 సార్లు డబ్బును తీసుకొవచ్చు
కొత్త నియమాల ప్రకారం, ఈపీఎఫ్ ఖాతాదారులు విద్య కోసం గరిష్టంగా 10 సార్లు, వివాహ అవసరాల కోసం 5 సార్లు డబ్బు తీసుకోవచ్చు. వైద్య అవసరాల కోసం సంవత్సరానికి 3 సార్లు, ప్రత్యేక పరిస్థితుల్లో 2 సార్లు తీసుకొవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పులు సభ్యుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని చేశారు. లక్షలాది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
100% ఉపసంహరణ పై ఆందోళనలు
ఈపీఎఫ్ఓ బోర్డు మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. సభ్యులు తమ ఖాతా నిధులను 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. అయితే కనీసం 25% నిధులను ఖాతాలో ఉంచడం తప్పనిసరి. అంటే గరిష్టంగా 75% వరకు మాత్రమే ఉపసంహరించుకోవచ్చు.
అయితే, ఈ మార్పులు ఈపీఎఫ్ ప్రాథమిక ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈపీఎఫ్ ప్రధాన లక్ష్యం ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత కల్పించడం. ముందుగా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
రిటైర్మెంట్ తర్వాత భద్రత కోసం ఈపీఎఫ్ ప్రాముఖ్యత
ఈపీఎఫ్ నిధులు రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఆర్థిక భరోసా ఇవ్వడం లక్ష్యంగా ఉంటాయి. పింఛన్, వైద్య అవసరాలు, వృద్ధాప్య ఖర్చులను తీర్చడంలో సహాయంగా ఉంటుంది. అయితే, 100 శాతం విత్ డ్రా రూల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈపీఎఫ్ఓ బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయాలు సభ్యుల జీవన సౌలభ్యాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
ఈపీఎఫ్ఓ కొత్త నియమాల ప్రకారం
• 13 పాత క్లిష్ట నిబంధనలను మూడు విభాగాలుగా మార్చారు.
• ఉద్యోగి, యజమాని ఇద్దరి కాంట్రిబ్యూషన్ నుండి ఉపసంహరణకు అనుమతి ఉంది.
• కనీసం 25% నిధులు ఖాతాలో ఉండాలి.
• ఉద్యోగం కోల్పోయిన వెంటనే 75% వరకు పీఎఫ్ తీసుకోవచ్చు.
• 12 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
• పింఛన్ నిధి 36 నెలల తర్వాత మాత్రమే ఉపసంహరించుకోవచ్చు (ఇంతకు ముందు 2 నెలలుగా ఉండేది)
ఈపీఎఫ్, ఈపీఎఫ్ఓ గురించి తెలుసా?
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) భారతదేశంలోని వేతన ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకం. ఇది కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిర్వహిస్తుంది.
1952లో ప్రారంభమైన ఈ పథకం ప్రకారం, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది తప్పనిసరి. ఉద్యోగులు చేరిన రోజునుండే ఇందులో సభ్యత్వం లభిస్తుంది.
ఉద్యోగి, యజమాని ఇద్దరూ వేతనంలో సుమారు 12% చొప్పున ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తారు. ప్రభుత్వమే ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ఈపీఎఫ్ఓ మూడు ప్రధాన పథకాలను నిర్వహిస్తుంది. అవి..
1. ఉద్యోగుల భవిష్య నిధి (EPF), 1952 – రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం.
2. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS), 1995 – 58 ఏళ్ల వయసు తర్వాత పింఛన్ కోసం.
3. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI), 1976 – బీమా ప్రయోజనాల కోసం.
ఈ మార్పులతో ఈపీఎఫ్ఓ సభ్యులకు మరింత సౌలభ్యం లభించనుంది. అయితే, పీఎఫ్ నిధులను దీర్ఘకాలిక భద్రత కోసం ఉపయోగించడం అత్యంత అవసరం, దానికి అనుగుణంగా మార్పులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.