నందా దేవిపై సీఐఏ అణు పరికరాన్ని పెట్టడానికి మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ అనుమతిచ్చారని.. దీనివల్లే అనేక ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే సోమవారం కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు… ఈ క్రమంలోనే గత కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1960లలో చైనాపై నిఘా పెట్టేందుకు హిమాలయాల్లోని నందా దేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాలను ఏర్పాటు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) వాళ్లు ఈ పరికరాలను ఏర్పాాటుచేశారని… ఇందుకు కాంగ్రెస్ పాలకులే అనుమతి ఇచ్చారని బిజెపి ఎంపీ ఆరోపించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో ఈ రహస్య ఆపరేషన్ చాలా దశల్లో జరిగిందని దూబే ఆరోపించారు. మొదట 1964లో జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో, తర్వాత 1967, 1969లలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో జరిగిందని పేర్కొన్నారు. అమెరికా ఏజెంట్లు వెనక్కి వెళ్ళిపోయాక, అణుశక్తితో నడిచే గూఢచర్య పరికరాలను పర్వతంపైనే వదిలేశారని, పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ప్రమాదకరమైన పదార్థాలను వదిలిపెట్టారని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ, ఆరోగ్య సంక్షోభాలతో సంబంధాలు
"భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ గారు 1964లో, మాజీ ప్రధాని ఇందిరా గారు 1967, 1969లలో అమెరికా సీఐఏతో కలిసి హిమాలయాల్లోని నందా దేవిపై చైనా కోసం అణు గూఢచర్య పరికరాలను పెట్టారు. తమ పని అయిపోగాననే అమెరికన్లు వెళ్లిపోయారని… ప్రమాదకరమైన ఆ పరికరాలన్నీ అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసించే ప్రజలలో క్యాన్సర్ రేట్లు పెరగడానికి ఇదే కారణం కాదా? హిమాలయ ప్రాంతాలలో హిమానీనదాలు కరగడానికి, మేఘాల విస్ఫోటనాలకు, ఇళ్లలో పగుళ్లు రావడానికి ఇదే కారణమా?'' అంటూ ఎంపీ ధూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘’1978లో లోక్‌సభలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇటీవల ప్రఖ్యాత అమెరికన్ వార్తాపత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. మన పిల్లలను కాపాడుకోవాల్సిన సమయం ఇది'' అంటూ సీఐఏ ఆపరేషన్‌కు, దీర్ఘకాలిక పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలకు సంబంధముందని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. వదిలేసిన అణు పరికరానికి, పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు, కరుగుతున్న హిమానీనదాలకు, తరచూ సంభవించే మేఘ విస్ఫోటనాలకు, హిమాలయ ప్రాంతాల్లోని ఇళ్లలో పగుళ్లకు సంబంధం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అంతకుముందు కూడా ధూభే ఈ ఆరోపణలు చేశారు. జూలై 14న దూబే ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. నందా దేవి పర్వతం దగ్గర తప్పిపోయిన అమెరికన్ అణు పరికరం పాత్రను ప్రశ్నిస్తూ, దేశంలో ఇటీవల జరిగిన ప్రకృతి వైపరీత్యాలతో దానికి సంబంధం ఉందని అన్నారు.
బీజేపీ ఎంపీ 1978లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులు అప్పటి అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖ కాపీని ఆ సందర్భంగా ఎక్స్ ద్వారా పంచుకున్నారు. హిమాలయాల్లో సీఐఏ రహస్య ఆపరేషన్ గురించి, హిమాలయాల్లో తప్పిపోయిందని నమ్ముతున్న ప్లూటోనియంతో నడిచే నిఘా పరికరం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రేడియోధార్మిక లీకేజీ జరగవచ్చనే ఆందోళనను ఆ లేఖలో వ్యక్తం చేశారని బిజెపి ఎంపీ గుర్తుచేశారు.
రేడియోధార్మిక కాలుష్యం గురించిన ఆరోపణలు నిజమని తేలితే ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి బాధ్యత వహించాలని అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వాన్ని కోరారని దూబే అన్నారు. 1960లలో జరిగిన ఒక పాత సీఐఏ ఆపరేషన్‌ను ఆయన ప్రస్తావించారు. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నందా దేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాలను ఉంచడం ఇందులో భాగమన్నారు. అలాంటి ఒక పరికరం హిమపాతంలో కూరుకుపోయి తప్పిపోయిందని, దాని నుంచి రేడియోధార్మిక పదార్థం లీక్ అయి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
కేదార్‌నాథ్ విపత్తు, తీస్తా నది వరదలు, గంగోత్రి, యమునోత్రిలలో హిమానీనదాలు కరగడం, గంగా నది నీటి మట్టం తగ్గడం వంటి వాటికి ఈ సంఘటనతో సంబంధం ఉందా అని దూబే ప్రశ్నించారు.
నెహ్రూ-గాంధీ కుటుంబంపై దాడి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా నెహ్రూ-గాంధీ కుటుంబం విదేశీ శక్తులకు లొంగిపోయి జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసిందని, భారతదేశ పర్యావరణానికి, రైతులకు, భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని దూబే ఆరోపించారు.


