- Home
- National
- Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Who Is Nitin Nabin : బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్ నియమితులయ్యారు. 45 ఏళ్ల వయసులో ఈ కీలక బాధ్యతలు స్వీకరించి, పార్టీలో యువ నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు.

అతి పిన్న వయసులోనే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్: నితిన్ నబిన్ రికార్డ్ !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, బీహార్‌కు చెందిన సీనియర్ మంత్రి, యువ నాయకుడు నితిన్ నబిన్‌ను పార్టీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
కేవలం 45 ఏళ్ల వయసులో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన నితిన్ నబిన్, పార్టీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో, ఆయన స్థానంలో తదుపరి పూర్తి స్థాయి అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
మకర సంక్రాంతి తర్వాత నితిన్ నబిన్ కు బాధ్యతలు
బీజేపీ సంప్రదాయం ప్రకారం, జాతీయ అధ్యక్ష పదవికి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో జేపీ నడ్డా కూడా అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పండుగ తర్వాత, నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి 2020లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పుడు నితిన్ నబిన్ రాకతో పార్టీలో అధికార మార్పిడి ప్రక్రియ మొదలైనట్లయింది.
గుజరాత్ డిప్యూటీ సీఎంగా హర్ష్ సంఘ్వీని నియమించిన కొద్ది రోజులకే, జాతీయ స్థాయిలో మరో యువ నేతకు పట్టం కట్టడం ద్వారా బీజేపీ నాయకత్వంలో తరం మారుతున్న సంకేతాలను స్పష్టంగా పంపింది.
నితిన్ నబిన్ రాజకీయ ప్రస్థానం: ఎమ్మెల్యే నుంచి జాతీయ స్థాయి వరకు ప్రయాణం
నితిన్ నబిన్ రాజకీయ ప్రయాణం అద్భుతమైన విజయాలతో సాగింది. 2006లో పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన మెజారిటీ 65,167 ఓట్లు. ఆ తర్వాత పాట్నాలోని బంకిపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు (2010, 2015, 2020) విజయం సాధించారు. మరోసారి బంకిపూర్ నుంచే మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు.
కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. 2021లో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా, 2024లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి బీహార్ ఎన్నికల విజయం తర్వాత ఆయనకు మళ్ళీ రోడ్డు నిర్మాణ శాఖను అప్పగించారు. పరిపాలనలోనూ, ప్రజా సేవలోనూ ఆయనకున్న అనుభవం పార్టీ అధిష్టానాన్ని మెప్పించింది.
నితిన్ నబిన్ సంస్థాగత అనుభవం, యువ మోర్చా నేపథ్యం
నితిన్ నబిన్ కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించిన బలమైన కార్యకర్త కూడా. 1980 మే 23న రాంచీలో జన్మించిన ఆయన, విద్యార్థి దశలోనే ఏబీవీపీ (ABVP) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి, దివంగత బీజేపీ నేత నబిన్ కిషోర్ సిన్హా మరణానంతరం క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
యువ మోర్చాలో ఆయన చేసిన కృషి అమోఘం. 2008లో భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ప్రారంభించి, యువకులను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. సిక్కిం ఎన్నికల ఇన్‌చార్జ్‌గా, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎన్నికల క్యాంపెయినర్ గా ఆయన చూపిన పనితీరు ప్రశంసనీయం. ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవడంలో ఆయన వ్యూహరచన కీలకంగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబిన్, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంలోనూ దిట్టగా గుర్తింపు పొందారు.
నితిన్ నబిన్ పై ప్రధాని మోదీ, నడ్డా ప్రశంసలు
నితిన్ నబిన్ నియామకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ, "నితిన్ నబిన్ ఒక కష్టపడి పనిచేసే కార్యకర్త. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన నిరంతరం శ్రమిస్తారు. ఆయన వినయం, సంస్థాగత అనుభవం రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని నేను నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు.
అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. "జ్ఞానానికి, సంస్కృతికి నిలయమైన బీహార్ నుంచి వచ్చిన డైనమిక్ లీడర్ నితిన్ నబిన్. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఆయన పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు," అని నడ్డా ట్వీట్ చేశారు.
నితిన్ నబిన్ ఆస్తులు, నేర చరిత్ర ఏమిటి?
ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా అఫిడవిట్ ప్రకారం, నితిన్ నబిన్ ఆస్తుల విలువ సుమారు రూ. 1 కోటి. ఇందులో చేతిలో ఉన్న నగదు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, పెట్టుబడులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే, నివాస భవనాలు, భూములు ఉన్నాయి.
ముఖ్యంగా, ఆయనపై ఎటువంటి నేరారోపణలు లేదా శిక్షలు లేవు. అఫిడవిట్‌లోని క్రిమినల్ రికార్డుల కాలమ్‌లో ఎటువంటి కేసులూ నమోదు కాలేదని స్పష్టంగా పేర్కొన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది ఆయన క్లీన్ ఇమేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు పాలనాదక్షత, మరోవైపు మచ్చలేని రాజకీయ జీవితం కలిగిన నితిన్ నబిన్, బీజేపీని భవిష్యత్తులో సమర్థంగా నడిపిస్తారని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.

