బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత సిద్ధరామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు శనివారం ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెసు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. 

రేస్ కోర్సు రోడ్డు సమీపంలో సిద్ధరామయ్యతో పాటు దినేశ్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, కె. సురేష్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వారు విమర్శించారు. కర్టాటనకు పోలీసు రాష్ట్రంగా మార్చిందని అన్నారు.

బీదర్ లోని షహీన్ పాఠశాలలో వేసిన నాటకంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయనే కారమంతో తొమ్మిది నుంచి 12 ఏల్ల వయస్సు గల పిల్లలను ఐదు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై, ఓ విద్యార్థి తల్లిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. 

దేశ ద్రోహం కింద ఇద్దరు మహిళలను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిద్ధరామయ్య అంతకు ముందు అన్నారు. కూతురు నుంచి తల్లిని వేరు చేసేందుకు రాష్ట్ర మహిళలు ముఖ్యమంత్రి యడ్యూరప్పను ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు. యడ్యూరప్ప విచక్షణ కోల్పోయినట్లున్నారని ఆయన అన్నారు.