Asianet News TeluguAsianet News Telugu

ఆ ఆరు జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్‌.. ఎమ్మెల్యేలు సైతం ఓటింగ్ కు దూరం..  కారణమేంటీ?

Nagaland: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections)నేడు తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కానీ నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాలోని  పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ పోలింగ్ స్టేషన్లలో ఒక్కరూ అంటే ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు రాలేదు. దీంతో ఆ పోలింగ్ స్టేషన్లలో  ’సున్నా శాతం’ పోలింగ్‌ నమోదు అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది? లక్షలాది మంది ఓటింగ్ లో పాల్గొనకపోవడానికి కారణమేంటీ?  

Zero voter turnout in 6 Nagaland districts amid shutdown call KRJ
Author
First Published Apr 19, 2024, 10:27 PM IST

Nagaland: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) శుక్రవారం తొలి విడత పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో భాగంగా  21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.  ఎండల సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా  ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సంఘం అందించిన లెక్కల ప్రకారం.. 60 శాతం పోలింగ్ నమోదైంది. కానీ,  నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలోని  పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 

నాగాలాండ్‌లో ఆరు తూర్పు జిల్లాల్లో 4,00,632 మంది ఉంటారు. వీరందరూ నాగా తెగకు చెందిన వారు. ఈ జిల్లాల్లో మొత్తం 20 శాసనసభ స్థానాలు ఉండగా.. 738 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్లల్లో వేచి చూసిన ఫలితం లేదు. ఒక్కరూ అంటే ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు రాలేదు. దీంతో ఆ పోలింగ్ స్టేషన్లలో  ’సున్నా శాతం’ పోలింగ్‌ నమోదు అయ్యింది. ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో పాటు లక్షల మంది ఓటర్లు.. పోలింగ్ కు దూరంగా ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం..
 
నాగా తెగ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోరాటం ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి  ENPO అనేది తూర్పు ప్రాంతంలోని ఏడు గిరిజన సంస్థల అపెక్స్ బాడీ. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని తీసుకురాలేదని ఆరోపిస్తూ.. ఏడు గిరిజన తెగలు కలిసి తూర్పు నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ENPO)గా ఏర్పడి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. తాము ఎన్నోఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నామనీ,  ఎన్నికలకు ముందు అంటే..  ఏప్రిల్‌ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్‌ పాటించాలని ఈఎన్‌పీవో ప్రకటించింది. ఈ ప్రకటనతో   పోలింగ్‌ రోజున లక్షల మంది ఓటర్లు పోలింగ్ దూరంగా ఉన్నారు. అధికారులు, అత్యవసర సేవలు మినహా రోడ్లపై ఏ ఒక్క వ్యక్తి, వాహనం కనిపించలేదు. అయినప్పటికీ అక్కడ శాంతియుత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు. 

ఎలాంటి అభ్యంతరం లేదు- నాగాలాండ్ సీఎం 

తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ENPO) లెవనెత్తిన ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (FNT)డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో ​​పేర్కొన్నారు. ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (FNT) ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అధికారాలను ఇప్పటికే సిఫార్సులు చేశామన్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో తనకు అందజేసిన ఎఫ్‌ఎన్‌టి కోసం 'డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్'ను తాను అంగీకరించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్వయంప్రతిపత్తి గల సంస్థను సిఫార్సు చేసిందని, తద్వారా ఈ ప్రాంతం మిగిలిన రాష్ట్రాలతో సమానంగా తగిన ఆర్థిక ప్యాకేజీని పొందగలదని ముఖ్యమంత్రి చెప్పారు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను సృష్టించినప్పుడు ఎన్నికైన సభ్యులతో సరైన వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి నీఫియు రియో ​​అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఉమ్మడి ఫార్ములాపై పనిచేయడానికి ఎమ్మెల్యేలు, ENPOలు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. 

ఎన్నికల సంఘం సీరియస్.. 

పార్లమెంట్ ఎన్నికల వేళ.. బంద్‌కు పిలుపునివ్వడాన్ని రాష్ర్ట ఎన్నికల సంఘం తప్పు బట్టింది. బంద్ కు పిలుపు నిచ్చిన ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios