మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ర‌క‌ర‌కాల మార్గాల్లో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల అత్యాశ‌ను, అవ‌స‌రాల‌ను ఆస‌ర‌గా చేసుకొని డ‌బ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘ‌ట‌న బెంగ‌ళూరులో జ‌రిగింది. కాల్ గ‌ర్ల్ కోసం అని ఫోన్ చేసిన ఓ యువకుడు ల‌క్ష రూపాయ‌లు పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

బెంగళూరులోని నీలాద్రి నగర్‌కు చెందిన 29 ఏళ్ల యువ‌కుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా కాల్ గర్ల్ కోసం ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేయ‌డం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్క‌డున్న నెంబ‌ర్‌కు కాల్ చేశాడు. 

ఆ త‌ర్వాత‌ అతనికి మరో నంబర్‌ నుంచి కాల్ వచ్చింది. వారు ఎస్కార్ట్ గ‌ర్ల్‌ వయస్సు, మాట్లాడే భాష, ఆమె ఉద్యోగం వంటి వివ‌రాలు చెప్పారు. బుకింగ్‌కు ముందుగా రూ.400 చెల్లించాలని చెప్పారు. రాహుల్ డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా ఆ మొత్తం చెల్లించాడు. అనంతరం అతడి లొకేషన్ అడిగి, త్వరలోనే అమ్మాయిని పంపుతామన్నారు.

కానీ మరో నంబర్‌ నుంచి మరో కాల్ వచ్చింది. అమ్మాయిని పంపడానికి ముందు రూ.6,900 రెండు సార్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పారు. ఇది తిరిగి ఇస్తామన్నారు. తరువాత "సర్వీస్ కోడ్" యాక్టివేట్ చేయాలని చెబుతూ, మరోసారి రూ.9,500 రెండు సార్లు పంపాలని కోరారు. అంతటితో ఆగకుండా, మరిన్ని ఛార్జీలు అంటూ మరిన్ని డబ్బులు అడిగారు.

చివరికి బుకింగ్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు. కానీ క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో రూ.7,590, తరువాత మరోసారి రూ.7,990, చివరికి GST పేరుతో రూ.13,346 రెండు లావాదేవీల్లో వసూలు చేశారు. ఇలా  మొత్తం రూ.1.4 లక్షలు  లాగేశారు. 

మ‌ళ్లీ డ‌బ్బులు అడిగేస‌రికి త‌న వ‌ద్ద లేవంటూ తెలిపాడు. అయినా అన్‌నోన్ నెంబ‌ర్ల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు రావ‌డం ఆగ‌క‌పోవ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేస్తున్న రోజున కూడా ఫ్రాడ్స్ నుంచి మెసేజ్‌లు వచ్చాయన్నాడు. మొత్తం ఐదు నంబర్ల నుంచి తనతో మాట్లాడారని తెలిపాడు.

పోలీసులు ఈ కేసును ఐటీ యాక్ట్ మరియు BNS సెక్షన్ 318 (మోసం) కింద నమోదు చేశారు. ఎస్కార్ట్‌ సర్వీసులు భారతదేశంలో అక్రమమని, అలాంటి వెబ్‌సైట్లను నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. ఫ్రాడ్స్ అకౌంట్ల నుంచి డబ్బును ఫ్రీజ్ చేసే ప్రక్రియ ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్‌లో ఎస్కార్ట్‌ సేవల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకొని, ఎవరూ  మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.