విజయవాడ నుంచి విశాఖ పట్నం వెళ్లే ప్రయాణికులకు ఓ అదిరిపోయే వార్త.జూన్ 1 నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో ఉదయపు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన ప్రయాణాలు మళ్లీ మొదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రయాణికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ మార్గంపై విమాన సర్వీసులు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
ఈ ఉదయపు విమాన సేవలు రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు మరింత సులభం చేయనున్నాయి. ఒకవైపు రాష్ట్ర రాజధాని విజయవాడ, మరోవైపు ఆర్థిక కేంద్రం విశాఖపట్నాన్ని ఈ రూట్ కలుపబోతోంది. ఇది రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వహించనున్న ఈ సేవల షెడ్యూల్ కూడా నిర్ణయించారు. ఉదయం 7.15కి విజయవాడ నుంచి విమానం బయల్దేరి, 8.25కి విశాఖపట్నానికి చేరుతుంది. అదే విమానం 8.45కి విశాఖపట్నం నుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించి, 9.50కి విజయవాడ చేరుకుంటుంది.
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సేవలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఇది భాగమవుతుందన్నారు.