ఐఎఎఫ్ - ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ కారు ర్యాలీ ముగింపు ... ఏకంగా 7000 కి.మీ సుదీర్ఘ ప్రయాణం
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, 7,000 కి.మీ. ప్రయాణించిన భారత వైమానిక దళం-ఉత్తరాఖండ్ యుద్ధ స్మారక కార్ ర్యాలీకి తవాంగ్‌లో ముగింపు పలికారు. ఈ కార్యక్రమం యువతను సాయుధ దళాలలో చేరడానికి ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించారు.
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు తవాంగ్‌లో భారత వైమానిక దళం-ఉత్తరాఖండ్ యుద్ధ స్మారక కారు ర్యాలీకి ముగింపు పలికారు. ఈ ర్యాలీ నెల రోజులపాటు దాదాపు 7,000 కి.మీ. దూరం ప్రయాణించింది. అయితే ముందుగా ఈ ర్యాలీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ముగింపు పలకాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ ర్యాలీ ముగింపు కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం ఖండు మాట్లాడుతూ...మాతృభూమిని రక్షిస్తున్న సాయుధ దళాలను ప్రశంసించారు. యువతను సాయుధ దళాలలో చేరడానికి ఆకర్షించే ఉద్దేశంతో సియాచిన్ నుండి తవాంగ్ వరకు 7000 కి.మీ ప్రయాణించిన వైమానిక దళ యోధులు, సీనియర్ సైనిక అధికారులను కొనియాడారు. ఈ కారు ర్యాలీ గురించి మొదట ఆలోచించి... ప్రణాళిక రూపొందించినందుకు ఉత్తరాఖండ్ యుద్ధ స్మారక చైర్మన్ తరుణ్ విజయ్‌ను అరుణాచల్ సీఎం అభినందించారు.
వింగ్ కమాండర్ విజయ్ ప్రకాష్ భట్ నేతృత్వంలోని ఈ ర్యాలీ థోయిస్ నుండి ప్రారంభమై తవాంగ్‌లో ముగిసింది, శ్రీనగర్, చండీగఢ్, డెహ్రాడూన్, లక్నో, దర్భంగా, సిలిగురి, హాసిమారా, గౌహతి మీదుగా ప్రయాణించింది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత వైమానిక దళ చీఫ్ ఏసిఎం ఏపీ సింగ్ కూడా పాల్గొన్నారు. అక్టోబర్ 23-24న హాసిమారా నుండి గౌహతి వరకు ర్యాలీ టీంకు ఆయన నాయకత్వం వహించారు.
ఐఎఎఫ్ 92వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడిన ఈ ర్యాలీ ధైర్యవంతులైన వైమానిక యోధులను సత్కరించడం, యువతను ఐఎఎప్ లో చేరడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ర్యాలీకి ఏసియానెట్ న్యూస్ మీడియా భాగస్వామిగా ఉంది. దేశభక్తిని చాటుతూ సాగిన ఈ ర్యాలీని విస్తృతంగా కవర్ చేసింది. ఆటో దిగ్గజం మారుతి జిమ్నీ వాహనాలు, ఇతర లాజిస్టిక్స్ కూడా ఈ ర్యాలీకి మద్దతును అందించాయి.
ఈ సందర్భంగా తవాంగ్ ఎమ్మెల్యే నామ్గే త్సెరింగ్, 190 మౌంటైన్ బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ విపుల్ సింగ్ రాజ్‌పుత్ తో పాటు అనేక మంది రాష్ట్ర ప్రముఖులు చారిత్రాత్మక కార్ ర్యాలీని చూసేందుకు హాజరయ్యారు.
అక్టోబర్ 1న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్చ ఐఎఎఫ్ చీఫ్ ఏసిఎం ఏపి సింగ్ లడఖ్‌లోని సియాచిన్ సమీపంలోని థోయిస్ వద్ద ర్యాలీకి ఘనంగా ప్రారంభించారు. 92వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 8న థోయిస్ వైమానిక దళ స్టేషన్ నుండి అధికారికంగా ప్రారంభించబడింది.
చైనాతో సరిహద్దు జిల్లా తవాంగ్ ప్రాముఖ్యత
తవాంగ్‌కు ఉత్తరాన టిబెట్ (చైనా), నైరుతిలో భూటాన్, తూర్పున (భారతదేశం) పశ్చిమ కమెంగ్ జిల్లా నుండి సెలా శ్రేణులు వేరు చేస్తాయి. ఇది ఒక రకమైన త్రి-జంక్షన్. ఇది భూటాన్‌తో భౌగోళిక సాన్నిహిత్యం, ఆగ్నేయాసియా మార్కెట్‌లకు యాక్సెస్ కలిగగిస్తుంది... అంటే ఇది మన దేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది. తవాంగ్‌ను చైనా ఆక్రమించినట్లయితే భూటాన్ చైనా ఆర్మీ పిఎల్ఏ చేత చుట్టుముట్టబడుతుంది. ఇది భారతదేశ భద్రతకు హానికరం.
3500 ఎత్తులో ఉన్న తవాంగ్ టిబెటన్ బౌద్ధులకు ఒక ప్రధాన పవిత్ర స్థలం. ఎందుకంటే ఇది ఆరవ దలైలామా జన్మస్థలం. మార్చి 30, 1959న టిబెట్ నుండి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుండి తప్పించుకున్న తర్వాత 14వ దలైలామా ఈ ప్రాంతం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించారు. ఏప్రిల్ 18, 1959న అస్సాంలోని తేజ్‌పూర్ చేరుకునే ముందు తవాంగ్ మొనాస్టరీలో కూడా రోజులు గడిపారు.