న్యూఢిల్లీ: కేంద్రంపై  టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణంపై ఆ మూడు పార్టీలు ఏ రకమైన వైఖరిని తీసుకొంటాయనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్, శివసేన, బీజేడీలు  అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేస్లాయా....వ్యతిరేకిస్తాయా అనేది ఇంకా  స్పష్టత రావాల్సి ఉంది. 

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం అమలుతో పాటు  పలు డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై టీడీపీ అవిశ్వాసతీర్మాణాన్ని ప్రతిపాదించింది. ఈ అవిశ్వాస తీర్మాణంపై జూలై 20వ తేదీన  లోక్‌సభలో చర్చ జరగనుంది

ప్రశ్నోత్తరాలను రద్దు చేసి శుక్రవారం 11 గంటల నుండి సాయంత్రం ఆరు  గంటల వరకు అవిశ్వాసంపై  చర్చను  కొనసాగించనున్నారు. అయితే  అవిశ్వాసంపై చర్చ సందర్భంగా  కేంద్రం తీరును ఎండగట్టాలని  టీడీపీ భావిస్తోంది.  బీజేపీయేతర పార్టీలు కూడ  కేంద్రం తీరును లోక్‌సభ వేదికగా  ఎండగట్టేందుకు అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నాయి.

అయితే  కేంద్రంపై అవిశ్వాసం విషయంలో సహకారం అందించాలని పలు పార్టీలను ఇప్పటికే టీడీపీ  ఎంపీలు కలిశారు.  టీఆర్ఎస్, శివసేన, బీజేడీ సహా పలు పార్టీల ఎంపీలను  కలిసి  అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరారు.

అవిశ్వాసంపై  టీఆర్ఎస్ మాత్రం  ఇంతవరకు తమ వైఖరిని మాత్రం బయటపెట్టలేదు. అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొంటామని టీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అడ్డుపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల సమ్యలు సానుకూలంగా  పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని  టీఆర్ఎస్ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.  అయితే  అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేస్తారా, వ్యతిరేకిస్తారా అనేది ఇంకా ఆ పార్టీ నుండి స్పష్టత రాలేదు. అయితే  ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ తలపెట్టారు.

అయితే ఈ ఫ్రంట్‌ ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో కర్ణాటకలో కుమారస్వామి సీఎంగా ఎన్నిక కావడంలో బీజేపీయేతర పార్టీలు  ఏకమయ్యాయి కాంగ్రెస్ పార్టీతో కలిసి  కొన్ని పార్టీలు వేదికను పంచుకొన్నాయి.ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనలేదు.దీంతో ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు అవిశ్వాసంపై ఓటింగ్‌ వరకు కూడ వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ ఓటింగ్ వచ్చే పరిస్థితులు నెలకొంటే ఆ సమయంలో ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకొంటామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఒడిశా రాష్ట్రంలో  త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేడీకి ఒడిశా రాష్ట్రంలో బీజేపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా ఉంది. అయితే కేంద్రంపై అవిశ్వాసంపై బీజేడీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే  కేంద్రంపై అవిశ్వాసం విషయంలో బీజేడీ తటస్థంగా ఉండే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.  అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మహారాష్ట్రలో కూడ బలంగా ఉన్న శివసేన  కూడ  అవిశ్వాసం విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేస్తోందని  కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే  బీజేపీ తీరుపై  శివసేన కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంది.అయితే శివసేనను ప్రసన్నం చేసుకొనేందుకు గాను  బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన ప్రకటించింది. అయితే  అవిశ్వాసంపై తాము చర్చలో పాల్గొంటామని  శివసేన ప్రకటించింది. అయితే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేస్తారా, వ్యతిరేకంగా ఓటు చేస్తారా అనే విషయమై ఇంకా ఆ పార్టీ స్పష్టత ఇవ్వలేదు.

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకె పార్టీ టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేస్తామని ప్రకటించింది. కావేరీ జల వివాదం విషయంలో  ఏ పార్టీ తమకు మద్దతు ఇవ్వనందున  తాము టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి  వ్యతిరేకంగా ఓటు చేస్తామని తేల్చి చెప్పింది.

అవిశ్వాసంలో నెగ్గాలంటే మోడీకి 268 మంది ఎంపీలు అవసరం. అయితే  ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు   314 మంది ఎంపీల బలం ఉంది. యూపీఏకు 66 సభ్యులు మాత్రమే ఉన్నారు.అయితే ఎన్డీఏలోని అసంతృప్తులను తమ వైపుకు తిప్పుకోవాలని టీడీపీ, కాంగ్రెస్ పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేనకు లోక్‌సభలో 18 మంది ఎంపీలు ఉన్నారు.  బీజేడీకి పార్లమెంట్‌లో 20 మంది ఎంపీలు ఉన్నారు. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ బలం 19కు చేరుకొంది. 

ఇక టీఆర్ఎస్‌కు 11 మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీ, వైసీపీ నుండి  ఫిరాయించిన ఇద్దరు ఎంపీలు  మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డిలు కూడ టీఆర్ఎస్ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.  దీంతో ఈ మూడు పార్టీల బలం 50కు చేరుతోంది.ఈ మూడు పార్టీలు ఎటువైపు మొగ్గుచూపుతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

ఈ మూడు పార్టీలు కూడ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేసినా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఒకవేళ ఓటింగ్ కు దూరంగా ఉన్నా కానీ ప్రభుత్వానికి నష్టం ఉండదు. అయితే ఈ మూడు పార్టీలు ఏ రకమైన నిర్ణయం తీసుకొన్న ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే మోడీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న ఎంపీ శతృఘ్నుసిన్హా కూడ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేస్తానని ప్రకటించడం విపక్షాలను నిరాశకు గురిచేసింది.