రాంచీ: జార్ఖండ్ లోని దుమ్మా జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భర్త కళ్లమ ుందే ఓ మహిళపై 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. 17 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

బాధితురాలు మంగళవారంనాడు తన భర్తతో కలిసి బయటకు వెళ్లింది. పని ముగించుకుని భర్తతో పాటు ఇంటికి తిరుగుముఖం పట్టింది. అయితే, మార్గమధ్యంలో వారిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. 

భర్తపై దుండగులు దాడి చేసి అతన్ని నిర్బంధించారు. ఆ తర్వాత అతని కళ్ల ఎదుటే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. తాను ఒక్క వ్యక్తిని మాత్రమే గుర్తించగలనని మహిళ చెప్పింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బాధిత మహిళ పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో నేరం గురించి గ్రామస్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. తొలుత 17 మంది అత్యాచారం చేసినట్లు చెప్పిన బాధిత మహిళ ఆ తర్వాత ఐదుగురు మాత్రమేనని పోలీసులకు చెప్పింది.