కేరళ, తిరువనంతపురంలో పదేళ్ల పాప పాము కాటుకు బలయ్యింది. నిద్రిస్తున్న పాప పరుపు కింద దాక్కున్న పాము కాటుకు ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెడితే..

ఆదిత్య అనే పదేళ్ల పాప, తల్లిదండ్రులతో కలిసి కేరళ, కొల్లం జిల్లా, పాథనాపురం, అంబేద్కర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. వీరికి పక్కా ఇల్లు లేదు. బొంతరాళ్లను గోడలుగా పేర్చుకుని, పైన టార్ఫలిన్ కవర్ వేసుకుని జీవిస్తున్నారు. ఆదిత్య తండ్రి చాలాసార్లు ప్రభుత్వానికి పక్కా ఇల్లు కోసం అర్జీ పెట్టుకున్నాడు.

ఇంట్లోకి తేళ్లూ, జెర్రులు లాంటి విషకీటకాలు చేరడానికి అనువుగా ఉంది. అలా ఆ రోజు ఆదిత్య పక్క కిందికి పాము చేరింది. ఇవేమీ తెలియని ఆదిత్య ఎప్పట్లాగే పడుకుంది. ఎప్పుడు కుట్టిందో తెలియదు. తెల్లారినా లేవకపోవడంతో అనుమానంతో పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెను కాటేసినది అత్యంత విషపూరితమైన సర్పం. మనిషి ఒంట్లోకి చేరగానే నరాల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూరోపెరాలసిస్‌కు దారి తీస్తుంది. 

ఆదిత్య పరిస్థితి మరింతగా విషమించడంతో శనివారం నాడు పుష్పగిరి మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌కు మార్చారు. ఆదిత్య ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆదిత్య మరణించింది. 

ఈ ఘటనలో ఆదిత్య తండ్రి రాజీవ్‌ కంటికి మంటకి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. నా బంగారు తల్లిని పొట్టనపెట్టుకున్నది పాము కాదు ప్రభుత్వం అంటున్నాడు. ‘‘మాకు పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే మా పరిస్థితి ఇలాగయ్యేది కాదు. పక్కా ఇంటికోసం ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టనేలేదు. ఇప్పుడు నా బిడ్డ బలయిపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు ఆదిత్య తండ్రి.