తల్లి కావాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. తల్లి అయ్యే క్రమంలో మహిళలు అనుకోకుండానే బరువు పెరుగుతారు. వారి శరీరంలో చాలా మార్పులు జరగుతాయి. దీంతో తమ శరీంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుని చూసి చాలా మంది మహిళలు జీర్ణించుకోలేరు. పెరిగిన బరువును ఎలాగైనా తగ్గించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. అయితే ఆహారనియమాలతో పాటు తేలికైన వ్యాయామాలు చేయడం ద్వారా మునుపటి శరీరాకృతిలోకి మారవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బరువు తగ్గాలని పూర్తిగా ఆహారాన్ని మానేయడం చాలా తప్పు. శరీరానికి తగిన క్యాలరీలను అందేలా చూసుకోవాలి. బరువు తగ్గేందుకు మాంసకృత్తులు, కొవ్వులు, ప్రొటీన్స్‌ వంటి సూక్ష్మ పోషకాలను సరిపడా తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం మితంగా తినాలి.

డెలివరీ తర్వాత మహిళలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అన్నంతోపాటు పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు, పాలు వంటివి తమ డైట్ లో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తగ్గకుండా జాగ్రత్త పడాలి.

డెలివరీ తర్వాత పిల్లలు సరిగా నిద్రపోకపోవడంతో తల్లికి కూడా నిద్ర సరిపోదు. కాబట్టి సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా చిన్న చిన్న వర్కౌట్స్ కూడా చేయాలి. చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం లాంటివి చేయాలి. యోగాలాంటివి చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.