హిందూ ధర్మ సాంప్రదాయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసే మాసం శ్రావణమాసం. శుభప్రదమైన ఈ నెల ఆరంభం నుంచి ముగిసే దాకా సంప్రదాయ భారతీయుల లోగిళ్లన్నీ భక్తి వాతావరణంతో నిండి ఉంటాయి. శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కావడంవల్ల శ్రావణ నక్షత్రం పేరే ఈ నెల నామంగా వచ్చింది. ఈ మాసంలోనే శివకేశవులిద్దరూ పూజలందుకోనుండడంలో విష్ణు, శివాలయాలు ఈ నెలలో భక్తులతో కిటకిటలాడుతాయి. శివకేశవులతోపాటు లక్ష్మీ, పార్వతులకు నిత్యపూజలు నిర్వహించే ఈ మాసాన్ని లక్ష్మీమాసం అని కూడా వ్యహరిస్తారు. అంతేకాదు ఈ మాసం ఎన్నో పండుగలను కూడా మోసుకొస్తుంది. 

పూజల మాసమైన శ్రావణం నేటి నుంచి ప్రారంభం కానుంది. హిందువులకు పవిత్ర మాసం కావడంతో అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలు, కఠోర ఉపవాసాలను నియమ నిష్టలతో నిర్వర్తిస్తారు. ఈ మాసంలో సోమవారం శివుడు, మంగళవారం మహాగణపతి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వరస్వామి, ఆదివారం సూర్యుడికి ఇలా ప్రతీ రోజు విశిష్టత కలిగి ఉంటుంది. ఆగస్టు 12 శ్రావణ శుద్ధ్య పాడ్యమితో ప్రారంభమై సెప్టెంబర్ తొమ్మిదో తేదీన అమావాస్యతో శ్రావణమాసం ముగియనుంది. ఈ మాసం వ్రతాలు, పూజలు, ఉపవాసాలకు పెట్టింది పేరు. 

శ్రావణ మాసానికి అత్యంత ప్రత్యేకతలు ఉన్నాయి. శివకేశవుల ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించే భక్తులు శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు. పూజలతో పాటు ఉపవాస దీక్ష చేపట్టడం ఎంతో శ్రేష్టదాయకమని అంటారు. నెల రోజులు ఒకే పూట భుజించి దీక్ష పూనడం ఈ మాస విశేషం. కోరికలు తీర్చే వరలక్ష్మీ వ్రతాలు, శ్రీకృష్ణుడు, హయగ్రీవుడు, భదరి నారాయణుడు, వరహమూర్తి, సంతోషి మాత జయంతోత్సవాలు, నాగపంచమి, రాఖీపౌర్ణమి వేడుకలు వస్తాయి. 

ఈ మాసంలో ప్రతీ సోమవారం శివుడికి రుద్రాభిషేకం, శుక్రవారం లక్ష్మీ ఆరాధన ఎంతో శ్రేష్టమైనవి. సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు. గ్రామ దేవతలకు నిర్వహించే భోనాల పండుగను ఈ మాసంలోనే నిర్వహిస్తారు. జంట నగరాల్లో ఆశాడమాసంలో నిర్వహిస్తే గ్రామాల్లో శ్రావణ మాసంలో నిర్వహించడం ఆచారం. 

ముత్తైదువలు ప్రత్యేకించి నూతన వధువులు తాము నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ ఈ నెలలో ప్రతీ మంగళవారం మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు. అనోన్య ధాంపత్యం, మంచి సంతానం కలగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేళ్ల పాటు ఈ మాసంలో ప్రతీ మంగళవారం వ్రతం చేస్తారు. ఇక సర్ఫదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు.

అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ నెల 24న వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ నెల 26న శ్రావణ పౌర్ణమి నాడు సోదరసోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం రాఖీ కడతారు. ఇదే రోజుల జంధ్యాల పౌర్ణమి కూడా జరుపుకుంటారు. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

శ్రావణ బహుళ అష్టమి నాడు సెప్టెంబర్ మూడో తేదీన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కృష్ణుడిని ఊయలలో వేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉట్లు కొడతారు. చిన్నారులను గోపికలు, కృష్ణులుగా అలంకరించి ఊరేగిస్తారు. ఇలా శ్రావణ మాసాంతం వ్రతాలు, ఉపవాసాలతో అధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.