వంటింట్లో ఎక్కువ ఉపయోగించే వస్తువుల్లో చాపింగ్ బోర్డు ఒకటి. సాధారణంగా కూరగాయలు కోయడానికి మనం ప్లాస్టిక్ లేదా చెక్క కట్టింగ్ బోర్డులను వాడుతుంటాం. కానీ వాటి వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ చూద్దాం.

సాధారణంగా మనం కూరగాయలు కట్ చేయడానికి చెక్కతో చేసిన కట్టింగ్ బోర్డ్, లేదా ప్లాస్టిక్ బోర్డును వాడుతుంటాం. పండ్లు, కూరగాయలు, మాంసం లాంటివాటిని కూడా వాటిపైనే కట్ చేస్తుంటాం. అయితే చెక్క కట్టింగ్ బోర్డ్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఇంతకీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోపోతే వచ్చే సమస్యలేంటో ఇక్కడ చూద్దాం. 

చెక్క బోర్డుపై కూరగాయలు కట్ చేస్తే ఏమవుతుంది?

1. నిపుణుల ప్రకారం చెక్కతో చేసిన కట్టింగ్ బోర్డుపై బాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. చెక్కపై కూరగాయలు కోసేటప్పుడు చిన్న చిన్న గీతలు ఏర్పడతాయి. ఆ గీతల్లోకి కూరగాయ ముక్కలు పోయి ఇరుక్కుపోతాయి. దాన్ని మనం సరిగ్గా కడగకపోతే బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. మనం మళ్లీ కూరగాయలు కోసేటప్పుడు అవి వాటితో కలిసి మన శరీరంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా జ్వరం, విరేచనాలు, వాంతులు, ఇన్ఫెక్షన్లు రావచ్చు.

2. కూరగాయలు కట్ చేయడానికి చాలామంది ప్లాస్టిక్ బోర్డులను కూడా వాడుతుంటారు. అయితే వీటిని నీటితో కడిగితే సరిపోదు. నీటితో కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. లేకపోతే బూజు పట్టే అవకాశం ఉంటుంది.

3. ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డు అయినా చెక్క కట్టింగ్ బోర్డు అయినా తొందరగానే పాడైపోతుంటాయి. ఎందుకంటే దాని మీద కత్తి పడేటప్పుడు దాని పైభాగం కొద్దికొద్దిగా చెదిరిపోతుంది. దీనివల్ల కూరగాయలు కోసేటప్పుడు కత్తి జారి చేతికి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బోర్డును సమయానుసారం మారుస్తూ ఉండాలి. 

4. కూరగాయల కట్టింగ్ బోర్డు వాసనలను పీల్చుకుంటుంది. మీరు చాపింగ్ బోర్డు మీద ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు కట్ చేస్తే వాటి వాసన ఆ బోర్డుకు అలాగే ఉంటుంది. తర్వాత మీరు దాని మీద పండ్లు లేదా ఇతర పదార్థాలు కట్ చేసినప్పుడు ఆ వాసన వస్తుంది. 

5. చాపింగ్ బోర్డు విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కూరగాయలు కట్ చేసిన తర్వాత బోర్డును నీటితో కడిగితే సరిపోదు. దానిపై అప్పుడప్పుడు నూనె రాసి.. ఎండలో ఆరబెట్టి, శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. బోర్డు ఎక్కువకాలం మన్నుతుంది.