Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Parijatham plant: పారిజాతం మొక్క నుంచి వచ్చే పూలు ఎంతో సువాసనను ఇస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఈ వాసన ఎక్కువగా వస్తుంది. అందుకే వీటిని నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. వీటిని కుండీలోనే సులువుగా పెంచుకోవచ్చు.

కుండీలోనే పారిజాతం
బాల్కనీలోనే కుండీలో పారిజాతం మొక్కను పెంచుకోవచ్చు. అదే పెరడు ఉంటే పారిజాతం పెద్ద చెట్టుగా మారిపోతుంది. అదే కుండీల్లో అయితే చిన్న మొక్కగానే ఎదుగుతుంది. రాత్రిపూట తెల్లని కొవ్వులు పూసి చుట్టు సువాసనను వెదజల్లే ఈ మొక్కను మీరు ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. రాత్రిపూట పూసే ఈ పువ్వులు ఉదయం అయ్యే సరికి నేలపై పడతాయి. అందుకే దీన్ని రాత్రి పూసే మల్లెపువ్వు అని పిలుస్తారు. పారిజాత పువ్వులను దేవాలయాల్లో పూజలకు వాడుతూ ఉంటారు. పురాణాల్లో కూడా ఈ మొక్కకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. సరైన పద్ధతి పాటించి కాస్త శ్రద్ధ పెడితే ఈ మొక్క కుండీలో కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది.
కుండీ ఎంపిక
పారిజాతం మొక్కను పెంచాలంటే ముందుగా మంచి కుండీ ఎంపిక చేసుకోవాలి. ఈ మొక్క మొదట చిన్నగా మొదలై తర్వాత కొమ్మలతో విస్తరిస్తుంది. కాబట్టి చిన్న కుండీ కాకుండా కాస్త పెద్ద కుండీ తీసుకోవడం మంచిది. కుండీ అడుగు భాగంలో కచ్చితంగా రంధ్రం ఉండేలా చూసుకోండి. లేకపోతే నీరు నిలిచిపోయి వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక కుండీలో వేసే మట్టి కూడా మొక్క పెరుగుదలపై ప్రభావం చూపిస్తుం.ది కాబట్టి మట్టిలో కొద్దిగా ఇసుక, ఆవు పేడ, వర్మీ కంపోస్టు వంటివన్నీ కలపాలి. కోకోపీట్ కూడా కలిపితే మంచిది. ఇలా చేసిన మట్టిలో వేర్లు సులువుగా పెరుగుతాయి. మొక్కను నాటిన తర్వాత ఇలాంటి మట్టిలో అవి త్వరగా నాటుకుంటాయి.
నీరు ఎంత పోయాలి?
పారిజాతం మొక్కకు ఎండ, నీరు.. రెండూ అవసరమే. రోజుకు కనీసం నాలుగైదు గంటల పాటు సూర్య కాంతి పడే చోట ఈ మొక్కను ఉంచాలి. బాల్కనీ, టెర్రస్ వైపు ఉంచితే మీకు మొక్కపై ఎండ పడే అవకాశం ఉంది. అలాగే నీరు కూడా రోజు పోయాల్సిన అవసరం లేదు. మట్టి పైభాగం ఎండిపోయినట్టు అనిపిస్తే మాత్రమే నీరు పోయండి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోతాయి. ఇక వేసవిలో అయితే ప్రతిరోజు కొంచెం కొంచెంగా నీరు పోయాల్సిన అవసరం ఉంది.
పువ్వుల కోసం ఇలా చేయండి
పారిజాతం మొక్క బాగా పెరిగి పువ్వులు ఎక్కువగా రావాలంటే దానికి బలం అవసరం. ఎందుకోసం ఆవు పేడ లేదా వర్మీ కంపోస్టు వంటివి మొక్కకు అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. కొందరు ఇంట్లో కడిగిన బియ్యం నీరు, కూరగాయలు కడిగిన నీరు కూడా పోస్తారు. ఇవి కూడా సహజ ఎరువులాగే పని చేస్తాయి. ఇక పువ్వులు ఎక్కువగా పూయాలంటే పాత కొమ్మలను కత్తిరిస్తూ ఉండండి. అప్పుడు కొత్త కొమ్మలు వచ్చి ఆ కొమ్మలకు పువ్వులు పూస్తాయి. ఆకులపై పురుగులు వంటివి కనిపిస్తే వెంటనే ఆకులను కత్తిరించండి. అలాగే వేప నూనెను నీటిలో కలిపి మొక్కపై పిచికారి చేయండి.
పువ్వులతో ఆహ్లాదం
పారిజాతం మొక్కను ఇంట్లో పెంచడం సులువే. సరైన కుండీ, మంచి మట్టి, తగినంత ఎండ, అవసరమైన నీరు, నెలకు ఒకసారైనా ప్రత్యేకమైన ఎరువులు అందిస్తే చాలు. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. రాత్రి అయితే చాలు.. సువాసన వీచే పువ్వులతో మీ ఇంటి వాతావరణం ఆహ్లాదంగా మార్చేస్తుంది. ఈ పువ్వులతో మీరు పూజలు చేస్తే ఎంతో ఫలితం కూడా అందుతుంది.

