నా ఫొటోతో నకిలీ పోర్న్ వీడియోలు సృష్టించారు: రాణా

They Created Fake Porn Videos With My Photo: Rana
Highlights

అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టిన ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయూబ్ అంటే గిట్టని వారు ఇప్పుడు ఆమెని టార్గెట్ చేశారు.

అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టిన ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయూబ్ అంటే గిట్టని వారు ఇప్పుడు ఆమెని టార్గెట్ చేశారు. ఇంటర్నెట్లో ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి, నకిలీ పోర్న్ వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెడుతున్నారు. అంతేకాకుండా పలు సామాజిక మాధ్యమాలలో కూడా ఆ నకిలీ వీడియోలను షేర్ చేస్తున్నారు. బిబిసి పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాణా అయూబ్ ఈ విషయాన్ని ఆడియో కాల్ ద్వారా వెల్లడించారు.

రాణా అయూబ్ ట్వీట్ చేసినట్లుగా ఓ ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 'ఐ హేట్ ఇండియా అండ్ ఇండియన్స్' అంటూ రాణా అయూబ్ పేరిట ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టులు వచ్చాయి. ఈ విషయంపై రాణా అయూబ్ స్పందిస్తూ, తను అలాంటి ట్వీట్‌లు చేయలేదని, తనంటే గిట్టని వారు ఎవరో ఇలా చేశారని చెప్పుకొచ్చారు.

నన్ను ట్రోల్ చేయటం ఇదేం మొదటి సారి కాదు, నా ముఖాన్ని ఎవరో నగ్న శరీరానికి తగిలించి నకిలీ పోర్న్ క్లిప్స్, ఫొటోస్ తయారు చేశారు, నా ఫోన్ నెంబర్‌ని కూడా ఇంటర్నెట్‌లో ఉంచి అసభ్యకరమైన కామెంట్లు చేశారు. దీంతో ప్రతిరోజూ నా ఫోన్‌కి కొన్ని వేల మెసేజ్‌లు, నగ్న చిత్రాలు వచ్చేవి అంటూ రాణా అయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాణా అయూబ్ విషయంలో చాలా ఏళ్లుగా జరుగుతున్న ఈ దాడిపట్ల చివరకు ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. రానాకు తక్షణమే సరైన రక్షణ కల్పించాలని ఐరాస భారత ప్రభుత్వాన్ని కోరింది. తెహల్కా పత్రికలో పనిచేసిన రాణా అయూబ్ గుజరాత్ మారణకాండ గురించి అనేక నిగూఢ విషయాలను సమాజానికి తెలియజేసింది.

loader