పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంతో పహల్గాం రక్తసిక్తమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. చైనా మొదలు అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలన్నీ ఉగ్రవాదుల చర్యను తప్పు పట్టాయి. 

Donald trump on Kashmir: కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని అందరూ ఖండిస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత్ కు మద్ధతునిలుస్తున్నాయి. ఈ ఘటనను ప్రపంచ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. పాక్ ఆక్రమించిన కశ్మీర్ ను తిరిగి తీసుకోవాలని భారతీయుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. ఈ తరుణంలోనే కశ్మీర్ అంశంపై అమెరికా తనవైఖరిని తేల్చి చెప్పింది. ఈ విషయమై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారా?

గాజా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాలను శాంతింపచేయడానికి ప్రయత్నించిన ట్రంప్, భారత్-పాకిస్తాన్ సమస్యపై మాత్రం మౌనం వహించారు. శుక్రవారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, "భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సమస్యను భారతదేశమే పరిష్కరించుకోగలదు" అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి, గాజా లేదా ఉక్రెయిన్ లాగా కాకుండా, భారత్-పాకిస్తాన్ వివాదంలో ఆయన మధ్యవర్తిత్వం వహించడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది.

శుక్రవారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు వెళ్లే మార్గంలో, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి గురించి మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ ఇలా అన్నారు, "పహల్గాంలో జరిగినది దారుణమైన ఘటన. కొన్నేళ్లుగా భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకుంటారు." అని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యల ద్వారా, భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మోదీ-ట్రంప్ స్నేహం గురించి ప్రపంచానికి తెలుసు. అయితే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తనకు సన్నిహితుడేనని ట్రంప్ చెప్పారు. "ఇద్దరు నాయకులను చాలా కాలంగా నాకు తెలుసు. కానీ భారత్-పాకిస్తాన్ సమస్య బహుశా అంతకంటే పాతది. కశ్మీర్ విషయంలో రెండు దేశాలు ఏళ్లుగా పోరాడుతున్నాయి." అని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే పహల్గాంలో జరిగిన దాడులకు పాల్పడిన వారిని గుర్తించడంలో భారత్ క్ సమాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఇప్పటికే ఆ దేశా నిఘా వ్యవస్థ తెలిపింది. 

అయితే, ఇటీవలి కాలంలో, గాజా దాడి లేదా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంఘటనలలో, ట్రంప్ ఇరు దేశాల నాయకులకు శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. అయితే, భారత్-పాకిస్తాన్ విషయంలో, ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పకనే చెప్పేశారు.