అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. తాజాగా ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ రచయిత్రి సంచలన ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళితే.. జీన్ కరోల్ అనే మహిళ తన జీవితంలోని అనుభవాల్ని న్యూయార్క్ మ్యాగజైన్ కవర్ స్టోరీలో రాశారు.

దీనిలో భాగంగా 1995లో మన్‌హట్టన్‌లోని బెర్గ్‌డొర్ఫ్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో తనను కలిసిన ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఒక గౌను కొన్నానని.. అది వేసుకుని చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందంటూ కోరాడు.

అందుకు తాను అంగీకరించి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లగానే ట్రంప్ తనపై అత్యాచారం చేశారని కరోల్ పేర్కొన్నారు. కాగా.. ఈ కథనంపై ట్రంప్ స్పందించారు. అసలు కరోల్‌ని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆమె తన పుస్తకం అమ్మకాలు పెంచుకోవడానికే ఈ కట్టుకథ అల్లారని ఆయన ఆరోపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా న్యూయార్క్ మ్యాగజైన్ ఇలాంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని ట్రంప్ నిలదీశారు.

అంత పెద్ద స్టోర్‌లో సీసీ కెమెరాలు ఉండవా..? సేల్స్ అటెండర్స్ ఉంటారు కదా.. డ్రెస్సింగ్ రూమ్‌లో అత్యాచారం ఎలా సాధ్యమని పైగా.. సదరు స్టోర్ వాళ్లు ఎలాంటి వీడియోలు లేవని ధ్రువీకరించారని ఆయన స్పష్టం చేశారు.

కాగా.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్‌పై 20 మంది మహిళలు అత్యాచారం, ఇతర కారణాలతో ఆరోపణలు చేశారు.