Hydration: ఎండలు ఎక్కువగా ఉంటే దాహం కూడా బాగా వేస్తుంది కదా.. అలాంటప్పుడు మామూలు నీళ్లు తాగే బదులు చిటికెడు సైంధవ లవణం(ఉప్పు) కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. ప్రాణాలు కాపాడే శక్తి కూడా లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
వానాకాలం మొదలైనా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు వాన కురిస్తే మర్నాడే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే త్వరగా శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. చెమట ఎక్కువ పడుతుంది. దీంతో ఎలక్ట్రోలైట్స్ బయటకి పోతాయి. తిరిగి ఎనర్జీ పొందడానికి చాలా మంది రకరకాల జ్యూస్ లు, డ్రింక్స్ తాగుతుంటారు. కానీ నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని తాగితే ఎనర్జీ పొందడంతో పాటు పోషకాలు, ఖనిజాలు కూడా లభిస్తాయి.
సాధారణ ఉప్పు సరిపోతుందా?
ఇక్కడ ఉప్పు అంటే వంటకు వాడే సాధారణ ఉప్పు కాదు. సైంధవ లవణం. ఇది హిమాలయాల్లో లభిస్తుంది. ఇందులో సోడియం క్లోరైడ్ తో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి.
ఉప్పు నీళ్లు ఎందుకు తాగాలి?
అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమటతో పాటు సోడియం, పొటాషియం వంటివి బయటకి పోతాయి. దీనివల్ల అలసట, తలతిరగడం, కండరాల నొప్పులు వస్తాయి. అందుకే నీళ్లలో కాస్త సైంధవ లవణ కలుపుకొని తాగితే ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి.
శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ లో ఉంచుతుంది
చెమట పట్టడం వల్ల శరీరం చల్లబడుతుంది. కాని శరీరంలో సోడియం తక్కువగా ఉంటే చెమట కూడా తగ్గుతుంది. దీనివల్ల హీట్ స్ట్రోక్ వస్తుంది. సైంధవ లవణం కలిపిన నీళ్ళు చెమట పట్టేలా చేసి శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తాయి.
జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది
సాధారణంగా ఉప్పు జీర్ణక్రియకి మంచిది. ఇది ఎంజైమ్స్ ని ఉత్తేజపరిచి ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం ఇస్తుంది.
కండరాల నొప్పులు తగ్గుతాయి
ఎవరికైనా కండరాల నొప్పులు ఉన్నాయంటే ఎలక్ట్రోలైట్స్ లోపం ఉందని అర్థం. అలాంటి వారు చిటికెడు సైంధవ లవణం కలిపిన నీరు తాగితే అందులోని పొటాషియం కండరాలకు శక్తినిస్తుంది. దీనివల్ల కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. సోడియం తక్కువైతే బీపీలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఉప్పు సోడియంని బ్యాలెన్స్ చేసి బీపీని నియంత్రిస్తుంది. కానీ హై బీపీ ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి ఇలా ఉప్పు నీళ్లు తాగడం మంచిది.
వడదెబ్బ నుంచి ప్రాణాలను రక్షిస్తుంది..
సాధారణ నీళ్ళు కొన్నిసార్లు శరీరంలోని ఖనిజాలని బయటకి పంపి, సోడియంని తగ్గిస్తాయి. సైంధవ లవణం నీళ్లు శరీరంలో నీటిని నిల్వ చేస్తాయి. దీనివల్ల శరీరం చల్లబడి, డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. ఎండలో తిరిగిన వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఇలా సైంధవ లవణం కలిపి నీరు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. ప్రాణాలు కాపాడవచ్చు.
ఉప్పు శరీరంలోని టాక్సిన్స్ ని కూడా బయటకి పంపిస్తుంది. దీనివల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. శరీరంలోని పీహెచ్ లెవెల్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
ఎలా వాడాలి?
ఒక లీటర్ నీళ్ళలో చిటికెడు సైంధవ లవణం కలిపి తాగాలి. ఎక్కువ కలుపుకోకూడదు. ఇందులో కొంచెం నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది.
ఎవరు తాగకూడదు?
హై బీపీ, కిడ్నీ సమస్యలు, నీరు నిల్వ ఉండే సమస్యలు, ఎక్కువ సోడియం ఉన్న ఆహారం తీసుకునేవారు డాక్టర్ని సంప్రదించి వేసవిలో ఉప్పు నీళ్లు తాగడం మంచిది.
