రోజుకి మూడు లీటర్ల నీరు తాగమని వైద్యులు చెబుతున్నారు. కానీ, అలా తాగడం వల్ల శరీరానికి మేలా,నష్టమా..?
నీరు మన శరీరానికి చాలా అవసరం. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతిరోజూ ఎంత నీరు తాగాలి అనేది చాలామందికి సందేహమే. ఇటీవల నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, రోజుకు సుమారు మూడు లీటర్ల నీరు తాగడం కొన్ని సందర్భాల్లో శరీరానికి మేలు చేస్తుంది.వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు ఎక్కువ నీరు తాగడం శరీరానికి తగినంత ద్రవాన్ని అందించి, ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. ఈ స్థాయిలో నీరు త్రాగడం మూత్రపిండాలకు మేలు చేసి, విషాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
అయితే, అందరికీ ఒకే పరిమాణం నీరు అవసరం అనుకోవడం తప్పుడు అభిప్రాయమే. కొంతమంది కొంచెం తక్కువగా లేదా ఎక్కువగా నీరు త్రాగాల్సిన అవసరం ఉంటుంది. శరీర బరువుతో పాటు జీవనశైలి, వాతావరణం ఆధారంగా నీటి అవసరం మారుతుంది. ఉదాహరణకు, 70 కిలోల బరువున్న వ్యక్తికి సుమారు 2.1 నుంచి 2.5 లీటర్ల నీరు చాలనిపిస్తుంది.
అయితే చాలా ఎక్కువ నీరు త్రాగడం వల్ల హైపోనాట్రేమియా అనే పరిస్థితి రావచ్చు. దీనివల్ల రక్తంలోని సోడియం స్థాయిలు తక్కువవుతాయి. ఇది తలనొప్పి, మూర్చ, తీవ్ర స్థితిలో కోమాకూ దారితీయొచ్చు. ముఖ్యంగా వృద్ధులు, అథ్లెట్లు, గుండె లేదా మూత్రపిండ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు ఎలక్ట్రోలైట్‌తో కూడిన ద్రవాలు తీసుకోవడం, దాహాన్ని గమనిస్తూ నీటి తీసుకొనడం అవసరం. నీరు ఆరోగ్యానికి అవసరం అయినప్పటికీ, అవసరానికి మించిన నీరు తీసుకోవడం సమస్యలు తలెత్తించే అవకాశాన్ని కలిగి ఉంది.
