వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ చేయాల్సిన దానికన్నా ఎక్కువ వ్యాయామం చేస్తేనే సమస్య. మరి ఎక్కువ వ్యాయామం చేస్తున్నామని ఎలా తెలుసుకోవాలి? అధిక వ్యాయామం వల్ల కలిగే నష్టాలేంటి? తదితర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

 

ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ మితిమీరిన వ్యాయామం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అధిక వ్యాయామం కండరాల నొప్పులు, గుండెపోటు వంటి సమస్యలను కలిగిస్తుందట. ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎక్కువ వ్యాయామం వల్ల కలిగే నష్టాలు:

నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 30 నిమిషాల వరకు వ్యాయామం చేయవచ్చు. అదే వారానికి 150 నిమిషాలు. కొంతమంది కఠినమైన వ్యాయామాలను ఎక్కువసేపు చేస్తుంటారు. కానీ అధిక వ్యాయామం వల్ల శరీరంలోని కేలరీలు చాలా త్వరగా తగ్గి... అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయంటున్నారు నిపుణులు. 

ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు శరీరం శక్తిని కోల్పోతుంది. దీనివల్ల పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు గుండె, ప్రేగులు వంటి అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. స్త్రీలకు అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, లేదా ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇది పునరుత్పత్తి, నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది.

కండరాల నొప్పులు:

ప్రతిరోజూ కఠినమైన వ్యాయామం చేస్తే కండరాలు ఎక్కువగా బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరం బలహీనపడటం మొదలవుతుంది. ఎక్కువ వ్యాయామం చేసేవారు బయటకు చూడటానికి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా, కాలక్రమేణా బలాన్ని కోల్పోయి అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

గాయాలు:

కొన్నివ్యాయామాలు అధికంగా చేస్తే.. మోకాలి ప్రాంతంలో పగుళ్లు, ఎముకల మధ్యలో గ్యాప్ లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు దీనివల్ల గాయాలు కూడా కావచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కుంటుంటే... కొన్ని రోజులు వ్యాయామం చేయకుండా ఉండటం మంచిది. లేకపోతే కండరాలపై ఒత్తిడి పెరిగి ఇతర సమస్యలకు దారితీయవచ్చు.

ఎక్కువ అలసట:

సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత అలసట రావడం సహజం. కానీ అధిక అలసట తీవ్రమైన వ్యాయామానికి సంకేతం. అంతేకాకుండా వ్యాయామం చేసే ముందు మీ శరీరం చాలా అలసిపోయి ఉండటం మంచిది కాదు. అది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. 

బరువు తగ్గడం:

తీవ్రమైన వ్యాయామం బరువు ఎక్కువగా తగ్గడానికి దారితీస్తుంది. ఎక్కువ వ్యాయామం చేస్తే హార్మోన్లలో అసమతుల్యత, ఆకలి లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆకలి లేకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో విఫలమవుతారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిద్రలేమి:

ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు ఒత్తిడి హార్మోన్లు ప్రభావితమై నిద్రలేమి సమస్యను కలిగిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోతే శారీరక అలసట, ఆందోళన, చిరాకు, మానసిక స్థితిలో మార్పులు, ఇతర సమస్యలు రావచ్చు.

ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు ఏం చేయాలి?

- ఎక్కువ వ్యాయామం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి విశ్రాంతి చాలా అవసరం. కాబట్టి వ్యాయామం చేయడం కొన్ని రోజులు ఆపేయవచ్చు.

- ఒత్తిడి, ఆందోళన, చిరాకు వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం, యోగా వంటి వ్యాయామాలు చేయవచ్చు.

- కండరాల నొప్పులు వస్తే మసాజ్ చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది.

- కఠినమైన పనులు చేయకుండా ఉండటం మంచిది.

- తిరిగి వ్యాయామం చేయడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.