PCOS Diet: పీసీఓఎస్ లక్షణాలను తగ్గించడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యతను సరిచేసే కొన్ని ఆహారాల గురించి ఆమె వివరించారు.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది మహిళల అండాశయాల పనితీరును ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనివల్ల పీరియడ్స్ సరిగా రాకపోవడం, కొన్నిసార్లు అసలు రాకపోవడం, అధిక రక్తస్రావం, ముఖం లేదా శరీరంపై అవాంఛిత రోమాలు, మొటిమలు, జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం, మందుల ద్వారా ఈ లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు.

PCOS లక్షణాలు మానసిక స్థితి, శరీరంలోని శక్తి స్థాయిలు, దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇది సంతానలేమికి ఒక ప్రధాన కారణంగా ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులు, మందులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా వివరిస్తున్నారు.

PCOS కేవలం ఒక సమస్య కాదని, ఇది హార్మోన్లు, జీవక్రియల అసమతుల్యతల కలయిక అని లవ్‌నీత్ బాత్రా అన్నారు. సరైన ఆహారాలు తీసుకోవడం ద్వారా PCOS లక్షణాలను తగ్గించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. PCOS వల్ల భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. PCOSను కంట్రోల్ చేయడానికి మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి లవ్‌నీత్ బాత్రా ఇలా చెబుతున్నారు.

పుదీనా టీ

ముఖంపై అవాంఛిత రోమాలను తగ్గించడానికి పుదీనా టీ అద్భుతంగా పనిచేస్తుందని లవ్‌నీత్ బాత్రా అంటున్నారు. రోజుకు ఒక కప్పు పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. ఇది క్రమంగా ముఖంపై వెంట్రుకల పెరుగుదలను తగ్గిస్తుంది.

దాల్చినచెక్క

రోజూ అర టీస్పూన్ దాల్చినచెక్క పొడిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి, శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.

అల్లం

గ్యాస్, అజీర్తి సమస్యలతో కడుపునొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపించడం వంటి సమస్యలను తగ్గించడానికి రోజూ అల్లం తీసుకోవచ్చు. అల్లం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది అండోత్పత్తి (ovulation) ప్రక్రియకు, మొత్తం హార్మోన్ల సమతుల్యతకు ఎంతగానో సహాయపడుతుంది.

పసుపు

పసుపులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. రోజూ అర టీస్పూన్ పసుపు తీసుకోవడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

బెర్రీ పండ్లు

బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి PCOS కారణంగా శరీరంలో ఏర్పడే అంతర్గత వాపును (inflammation) తగ్గించడంలో సహాయపడతాయి.

View post on Instagram