చాలామంది ఆడవాళ్లు.. ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వారు నిర్లక్ష్యం చేసే చిన్న సమస్యలే.. భవిష్యత్తులో పెద్దగా మారి ఇబ్బంది పెడుతుంటాయి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

 

సాధారణంగా స్త్రీలు.. ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటారు కానీ... వారి గురించి వారు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా... వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. స్త్రీలలో వచ్చే కొన్ని క్యాన్సర్ల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. ప్రారంభంలోనే ఈ లక్షణాలను గుర్తించకపోతే అవి ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. స్త్రీలలో కనిపించే కొన్ని ముఖ్యమైన క్యాన్సర్ లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయద్దు..

1. బరువు తగ్గడం:

సడెన్ గా బరువు తగ్గిపోవడం చాలా వ్యాధుల లక్షణం కావచ్చు. కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరిన్ క్యాన్సర్ లాంటి వాటి వల్ల కూడా బరువు తగ్గవచ్చు. కాబట్టి సడెన్ గా బరువు తగ్గినప్పుడు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

2. అలసట:

ఎక్కువ అలసట చాలా వ్యాధుల లక్షణం అయినప్పటికీ… కొన్నిసార్లు క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు.

3. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు:

బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవారిలో ఎక్కువగా వచ్చే సమస్య. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను పట్టించుకోకపోతే సమస్య తీవ్రమవుతుంది. రొమ్ముల ఆకారంలో మార్పు, రొమ్ముల్లో గడ్డ, ఒక రొమ్ము పెద్దగా అవడం, రొమ్ము చర్మం మందంగా అవడం లాంటివి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

4. మలవిసర్జనలో మార్పులు:

గ్యాస్, మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, మలవిసర్జనలో మార్పులు, మలంలో రక్తం లాంటివి కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

5. రక్తస్రావం:

పీరియడ్స్ కాకుండా వేరే సమయంలో రక్తస్రావం కావడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పి లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

6. దగ్గు, గొంతు మార్పు:

దగ్గు తగ్గకపోవడం, జలుబు, గొంతు మార్పు, మెడ వాపు లాంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయద్దు. అవి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

7. చర్మంలో మార్పులు:

చర్మంపై కొత్తగా మచ్చలు రావడం, ఉన్న మచ్చల రంగు, ఆకారం, పరిమాణం మారడం లాంటివి చర్మ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

గమనిక: 

ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.