Women: అమ్మాయిలు పెళ్లి తర్వాత బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ప్రత్యేకమైంది. పెళ్లి విషయంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిల్లోనూ చాలా రకాల భయాలుంటాయి. పెళ్లి తర్వాత జీవితంలో చాలా మార్పులొస్తాయి. కొన్ని మానసికంగా.. మరికొన్ని శారీరకంగా. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో ప్రధానమైంది బరువు పెరగడం. అసలు పెళ్లి తర్వాత ఆడవాళ్లు ఎందుకు బరువు పెరుగుతారో ఇక్కడ తెలుసుకుందాం.

పెళ్లి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలో ఒక రకమైన భయం, ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఇది ఎక్కువ. తనకు తెలియని వారి జీవితంలోకి వెళ్తున్నామనే ఆలోచన గందరగోళం కలిగిస్తుంది. ఈ సమయంలో అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా మార్పులొస్తాయి. ముఖ్యంగా పెళ్లయ్యాక అమ్మాయిలు లావెక్కడం చూస్తుంటాం. దీనికి నిజమైన కారణమేంటీ? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
ఫుడ్ హ్యాబిట్స్
పెళ్లయిన వెంటనే మహిళల జీవనశైలిలో మారేది వారి ఆహారపు అలవాట్లు. కొత్త ఆహారపు అలవాట్లు ఎక్కువవుతాయి. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో పిండి వంటలు, భోజనం ఎక్కువ చేస్తారు. బంధువుల ఇంటికి వెళ్తారు. ఈ కారణంగా తెలియకుండానే ఎక్కువ తింటారు. దీనివల్ల మహిళలు లావెక్కుతారని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కచోటే కూర్చోవడం
పెళ్లికి ముందు అమ్మాయిలు కొంత స్వతంత్రంగా ఉంటారు. బయటకు వెళ్తారు. వ్యాయామం, వాకింగ్ చేస్తారు. కానీ పెళ్లయ్యాక కొన్నింటికీ ఫుల్‌స్టాప్ పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఒక్కచోటే కూర్చుని చేసే పని ఎక్కువ చేస్తారు. దీనివల్ల కూడా పెళ్లయిన కొత్తలో అమ్మాయిలు బరువు పెరుగుతారని చెబుతున్నారు నిపుణులు.
ఒత్తిడి
ముందుగా తెలియని వాళ్లతో ఉండడం, వారి ఆచార వ్యవహారాలు పాటించడం అమ్మాయిలకు ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా భావోద్వేగాల్లో వచ్చే మార్పుల వల్ల హార్మోన్లలోనూ మార్పులొస్తాయి. దీనివల్ల తెలియకుండానే ఎక్కువ తింటారు. ఇది కూడా పెళ్లయిన కొత్తలో లావెక్కడానికి ఒక కారణం అవుతుందట.
భావోద్వేగ మార్పులు
పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ వల్ల శరీరంలో మార్పులొచ్చి లావెక్కుతారనేది ఒక వాదన. కానీ ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగ మార్పులే బరువు పెరగడానికి కారణమంటున్నారు.