Mothers Day: ఖరీదైన గిఫ్ట్స్ కాదు,అమ్మ కోసం ఈ ఐదు చేయండి..!
మదర్స్ డే వస్తోంది. ఈ మాతృదినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తికి బహుమతులు కొనిపెడుతూ ఉంటారు.అయితే.. గిఫ్ట్స్ ఇవ్వడం కాకుండా.. మీ అమ్మ సంతోషంగా ఉండాలంటే కనీసం ఆ ఒక్కరోజు అయినా ఒక ఐదు పనులు మీరు చేస్తే చాలు.

అమ్మ అంటే ఇష్టం లేని వాళ్లు ఉంటారా? మనకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని పనులు అమ్మతోనే చేయించుకుంటారు. తిరిగి అమ్మ కోసం మాత్రం ఏదీ చేయరు. ఇలా మదర్స్ డే లాంటివి వచ్చినప్పుడు ఓ చీర, నగలో కొనిపెడతారు. కానీ, నిజంగా మీకు మీ తల్లి మీద ప్రేమ ఉంటే.. వారికి ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం కాదు ఐదు పనులు చేయాలి. ఒకరోజంతా మీరు వారిలా మారిపోయి వారిపై ప్రేమ కురిపించాలి.
ప్రేమగా ఒక లెటర్ రాయండి..
ఈ డిజిటల్ యుగంలో ఉత్తరాలతో పని లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది. ఎవరికి ఏ విషయం చెప్పాలన్నా సెకన్లలో సమాచరం చేరవేస్తున్నారు. కానీ, చేతితో రాసిన లేఖ లో ఉన్న మాధుర్యం ఫోన్ టెక్ట్స్ మెసేజ్ లలో ఉండదు. అందుకే, మీకు మీ అమ్మ ఎంత ఇష్టమూ, ఏ విషయంలో వారు మీకు స్ఫూర్తిగా నిలిచారో, ఇలా మీ ప్రేమను తెలియజేసే ఏదైనా విషయాన్ని ఆ లేఖలోరాయండి. మీరు రాసే నాలుగు వ్యాఖ్యాలు అయినా వారిని సంతోషపెడతాయి. ఈ లేఖ బహుమతిగా చిన్నదే కావచ్చు. కానీ.. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.
ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వండి
బహుమతి అంటే ఖరీదైన వస్తువులే కాదు. మీ అమ్మకు వారి అవసరానికి లేదా ఇష్టానికి తగిన చిన్న , అందమైన బహుమతి ఇవ్వవచ్చు. చీర, పుస్తకం, హ్యాండ్‌బ్యాగ్ లేదా వారికి ఇష్టమైన తీపి వస్తువులు వంటివి. బహుమతి ద్వారా వారు మీరు వారి ఇష్టాన్ని అర్థం చేసుకున్నారని భావిస్తారు.
పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి
మదర్స్ డే రోజున మీ అమ్మతో కలిసి కూర్చుని మీ చిన్ననాటి , పాత రోజులను గుర్తు చేసుకోవచ్చు. ఇంటి ఆల్బమ్‌ను తీసి, పాత ఫోటోలను చూసి, ఆ క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకోండి. అమ్మతో కలిసి పాత జ్ఞాపకాలను పంచుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.
వారితో కొంత సమయం గడపండి
ఈ ప్రత్యేకమైన రోజున మీ అమ్మ కోసం సమయం కేటాయించి, రోజంతా వారితో గడపండి. వారితో బయటకు వెళ్లండి, సినిమా చూడండి లేదా వారికి ఇష్టమైన కార్యకలాపాలు చేయండి. ఈ సమయం మీకు, వారికి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.
ఇంటి పనులు మీరే చేయండి
మదర్స్ డే రోజున మీ అమ్మకు కొంత విశ్రాంతి ఇవ్వడానికి ఇంటి పనులు మీరే చేయడానికి ప్రయత్నించండి. ఈ చిన్న పని కూడా వారి రోజును చాలా ప్రత్యేకంగా చేస్తుంది. వారి శ్రమకు గుర్తింపు లభించిందని వారికి అనిపిస్తుంది.