పట్టు చీరపై టీ మరకలు పడ్డాయా? ఇలా చేస్తే క్షణాల్లో మరకలు మాయం
పట్టు చీరపై మరకలు పడితే వదలడం అంత సులభం కాదు. ముఖ్యంగా టీ, కాఫీ మరకలు అంత ఈజీగా వదలవు. సబ్బుతో ఉతికినా మొత్తం వదలవు. అలాంటివారు. కానీ, కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడటం వల్ల పట్టు చీరపై పడ్డ టీ మరకలను ఈజీగా తొలగించవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ మరకను ఎలా తొలగించాలి ?
సాధారణంగా మహిళలకు పట్టు చీరలంటే చాలా ఇష్టం. పండుగలు, శుభకార్యాలలో పట్టు చీరలను ధరిస్తారు. అయితే.. కొన్నిసార్లు పట్టు చీరపై టీ లేదా కాఫీ మరక పడవచ్చు. ఆ మరకలను తొలగించడం కొంచెం కష్టమేనని చెప్పాలి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పట్టు చీరపై పడ్డ టీ మరకను చాలా సులభంగా, అది కూడా చీరకు ఎలాంటి నష్టం కలగకుండా తొలగించవచ్చంట.
ఇలా చేయండి
ముందుగా మరక పడిన చోట చల్లటి నీటిని నెమ్మదిగా పోయాలి. దీనివల్ల మరక వేరే చోటికి పాకకుండా నిరోధించవచ్చు. తరువాత, కాస్త డిటర్జెంట్ లేదా షాంపూను మరకలపై పోసి, 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటిలో అరగంట నానబెట్టి, ఆపై నెమ్మదిగా ఉతకాలి. చీరను ఎప్పుడూ రుద్దకూడదు. మెల్లగా కడగాలి. ఇలా చేస్తే పట్టు చీరపై పడ్డ టీ మరక సులభంగా పోతుంది.
మరొక విధంగా
ఒక కప్పులో వెనిగర్, చల్లటి నీటిని సమానంగా తీసుకోండి. అందులో ఒక శుభ్రమైన వస్త్రాన్ని ముంచి మరకపై నెమ్మదిగా రుద్దండి. మరక పోయే వరకు ఇలా చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో చీరను నానబెట్టి నెమ్మదిగా ఉతకాలి. ఇలా చేయడం వల్ల మరక సులభంగా పోతుంది.
మరక ఎండిపోతే
చీరపై పడ్డ టీ మరక ఎండిపోతే కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి గట్టి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్ ను మరకపై అప్తై చేసి.. మెత్తటి బ్రష్ లేదా వస్త్రంతో నెమ్మదిగా రుద్దాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో చీరను ఉతకాలి.
గుర్తుంచుకోండి
పట్టు చీరపై మరక పడితే దానిని అలాగే వదిలేయకుండా వెంటనే శుభ్రం చేస్తేనే మరక త్వరగా పోతుంది. అలాగే పట్టు చీరకు ఎప్పుడూ వేడి నీటిని వాడకూడదు. ఎందుకంటే అది పట్టు దారాలను దెబ్బతీస్తుంది. మరకను శాశ్వతంగా ఉండిపోతుంది. అలాగే.. పట్టు చీరను గట్టిగా రుద్దకూడదు. అలా రుద్దితే మరక మరింత పాకే అవకాశం ఉంది.