Menopause: 40 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఇవే
Menopause: వయసు పెరిగేకొద్దీ మహిళల్లో హార్మోన్ మార్పులు కామన్. 40 ఏళ్ల తర్వాత అంటే మోనోపాజ్ దశలో మరింత క్లియర్ గా కనిపిస్తుంది. చర్మం, జుట్టుపై ప్రభావం ఉంటుంది. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా?

హార్మోన్ మార్పులకు సంకేతం
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మహిళల్లో శరీరంలో మార్పులు రావడం సహజం. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. చర్మం ఒకప్పుడు ఉన్నట్టు స్ట్రాంగ్ గా లేకపోవడం, పొడిబారడం, నిగారింపు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు కూడా మునుపటిలా ఒత్తుగా లేకుండా పలచబడటం చాలామంది మహిళలు గమనిస్తుంటారు. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చిన సమస్యలు కాకుండా, మెనోపాజ్‌కు ముందు మొదలయ్యే హార్మోన్ మార్పులకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.
మహిళల చర్మ ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ చాలా కీలకం
నిపుణులు ఏం చెబుతున్నారంటే...మహిళల చర్మ ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ చాలా కీలకం. వయసు పెరిగేకొద్దీ ఈ హార్మోన్ స్థాయి తగ్గుతుండటంతో కొలాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని ప్రభావంగా చర్మంలో తేమ తగ్గడం, చిన్న చిన్న గీతలు కనిపించడం, ముఖంలో నిగారింపు తగ్గినట్లు అనిపిస్తుంది. మెనోపాజ్ ప్రారంభమైన మొదట్లోనే కొలాజెన్ గణనీయంగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఈ దశలో చర్మ మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కొలాజిన్ అనేది మన శరీరంలో సహజంగా ఉండే ప్రోటీన్. ఇది చర్మం, ఎముకలు, కండరాలు, కీళ్లు, జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మాన్ని వదులుకాకుండా, నిగారింపు కోల్పోకుండా చేస్తుంది.
ఇవన్నీ హార్మోన్ అసమతుల్యత వల్లే
హార్మోన్ మార్పులు జుట్టుపై కూడా ప్రభావం చూపుతాయి. చాలామంది మహిళల్లో తలపై జుట్టు పలుచబడటం, జుట్టు పగిలిపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరు మహిళల్లో ఇది 40 ఏళ్ల వయసులోనే మొదలవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యత వల్లనే జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే మార్పుల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దశలో స్కిన్‌కేర్, హెయిర్‌కేర్ విధానంలో కొద్దిగా మార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు. చర్మానికి తేమ అందించే మాయిశ్చరైజర్లు క్రమంగా వాడుతూ ఉండాలి. అలాగే తల కుదుళ్లూ శుభ్రంగా ఉంచుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
మోనోపాజ్ కోసం భయపడక్కర్లేదు
మెనోపాజ్ అనేది జీవితంలో సహజంగా వచ్చే దశ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. మోనోపాజ్ కోసం భయపడక్కర్లేదంటున్నారు. శరీరంలో జరుగుతున్న మార్పులను అర్థం చేసుకుని, సరైన సంరక్షణ తీసుకుంటే ఈ దశను కూడా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

