Healthy Lifestyle: వీటిని తింటే నూరేండ్లు బతకడం గ్యారంటీ..!
Healthy Lifestyle: నిండు నూరేండ్లు బతకాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ అలా బతడానికి ప్రయత్నించినప్పుడే నూరేండ్లు ఏంది120 ఏండ్లైనా బతుకుతారు. అందుకు మీరు చేయాల్సింది మీ డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలంతే..

ఆరోగ్యంగా ఉంటూ.. నిండు నూరేళ్లు బతకాలని కోరుకోని వారంటూ ఎవరూ ఉండరేమో కదా. అయితే మన ఆరోగ్యం, ఆయుష్షు ఎవరి చేతిలోనో ఉండవు అది మన చేతిలో పనే. ఆరోగ్యం బాగుంటేనే మీరు ఎలాంటి జబ్బులు లేకుండా ఎక్కువ రోజులు జీవిస్తారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పలు అధ్యయనాలు ఇప్పటికే స్ఫష్టం చేశాయి.
అయితే పలు అధ్యయనాల ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాలు మన ఆయుష్షును పెంచడానికి ఎంతో సహాయపడతాయట. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలనికి చెందిన ఇద్దరు ప్రొఫేసర్లు.. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుంది అనే విషయంపై పరిశోధన చేశారు. వీరు జరిపిన పరిశోధనలో ఒక వ్యక్తి ఎక్కువ కాలం బతకాలంటే ఆహారంతో పాటుగా జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలని తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం.. మీ రోజు వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉండేట్టు చూసుకోవాలి. అలాగే శరీరానికి అవసరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రోటీన్ లో ఎక్కువ భాగం మొక్కలు, చెట్ల నుంచి లభించే ఆహారాలు ఉండేట్టు చూసుకోవాలి.
అలాగే కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి. చేపలను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. కానీ రెడ్ మీట్ ను మాత్రం అస్సలు తినకూడదు. తక్కువ మొత్తంలో తెల్ల మాంసాలను తినొచ్చు. షుగర్ వాడకం కూడా తగ్గించాలి. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను కొంత పరిమాణంలో తీసుకోవాలి. అలాగే డార్క్ చాక్లెట్ ను కూడా తినొచ్చు.
ఉపవాసం కూడా అవసరమే.. ఉదయం 11 లేదా 12 గంటల లోపు భోజనం చేసి.. మిగతా 12 గంటలు ఉపవాసం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. అలాగే 3 లేదా 4 నెలల్లో 5 రోజులు ఫాస్టింగ్ ఉంటడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
నిపుణుల సూచనల మేరకు.. ఈ పరిశోధనలో ఏం తినాలో చెప్పారు కానీ ఎంత పరిమాణంలో తినాలో మాత్రం చెప్పలేదు. కాబట్టి ఈ డైట్ ను ఫాలో అయ్యేవారు నిపుణుల సలహాలను తీసుకుని డైట్ ను ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ లైఫ్ స్టైల్ లో ఈ మార్పులు చేస్తే దీర్ఘాయుష్షు మీ సొంతం అవుతుంది.