Banarasi Silk Saree: పట్టు చీరలు కొనేముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
పట్టు చీరలంటే ఇష్టపడని ఆడవాళ్లు ఎవరుంటారు చెప్పండి? ఇంట్లో ఎన్ని చీరలున్నా.. మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందంటే చాలు.. కొనేస్తుంటారు. అయితే పట్టు చీరలు కొనేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.

బనారస్ పట్టు చీర
అసలైన బనారస్ చీరలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేస్తారు. స్వచ్ఛమైన పట్టు మృదువుగా ఉంటుంది. సహజమైన మెరుపు కలిగి ఉంటుంది. చీర నుంచి ఒక చిన్న పట్టు నూలు తీసుకొని మెల్లగా కాల్చండి. స్వచ్ఛమైన పట్టు అయితే జుట్టు కాలినట్లు వాసన వస్తుంది. కృత్రిమ పట్టు అయితే ప్లాస్టిక్ కాలినట్లు వాసన వస్తుంది. భారత ప్రభుత్వ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉన్న చీరలను కొనడం ద్వారా మీరు కొనే పట్టు స్వచ్ఛమైందిగా నిర్థారించుకోవచ్చు.
వెండి, బంగారు రంగు జరీ వర్క్
బనారస్ చీరల ప్రత్యేకత దాని జరీ వర్క్. ఈ జరీ ఎక్కువగా బంగారం లేదా వెండి రంగు దారాలతో నేయబడి ఉంటుంది. అసలైన బనారస్ చీరల్లో వాడే జరీ.. స్వచ్ఛమైన వెండి దారాలపై బంగారు పూత లేదా రాగి దారాలపై బంగారు పూత పూసినట్లుగా ఉంటుంది. చౌక ధర చీరల్లో కృత్రిమ జరీ లేదా రోమన్ జరీ వాడతారు. కాబట్టి చీర కొనేముందు జరీ వర్క్ దట్టంగా, కళాత్మకంగా ఉందో లేదో చెక్ చేయండి.
ప్రత్యేక నేత టెక్నిక్
బనారస్ చీరలకు ప్రత్యేకమైన నేత టెక్నిక్ ఉంటుంది. ఈ డిజైన్లను నేరుగా చీరపై నేస్తారు. బనారస్ చీరలను మగ్గంపై నేసినట్లయితే అవి మెషిన్ వర్క్ లా కాకుండా.. కొద్దిగా అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. అసలైన బనారస్ చీరల్లో "జలా" లేదా "జాక్వర్డ్" మగ్గంతో నేసిన సంక్లిష్టమైన డిజైన్లు ఉంటాయి.
పట్టు చీర బరువుగా ఉంటే?
స్వచ్ఛమైన పట్టు, దట్టమైన జరీ వర్క్ వల్ల అసలైన బనారస్ చీరలు ఇతర పట్టు చీరల కంటే కొంచెం బరువుగా ఉంటాయి. చీరను చేతిలోకి తీసుకుని చూడండి. అది బరువుగా అనిపిస్తే.. అది అసలైన పట్టు చీరగా గుర్తించవచ్చు. ఎక్కువ బరువు, వాడిన పట్టు, జరీ పరిమాణాన్ని సూచిస్తుంది. బట్టను తాకి చూస్తే.. అది దట్టంగా, గట్టిగా నేయబడి ఉంటుంది. నాణ్యత తక్కువ చీరలు పలుచగా, వదులుగా ఉంటాయి.
ఈ చీరల ధర కాస్త ఎక్కువే..
బనారస్ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం, నైపుణ్యం, నాణ్యమైన మెటీరియల్స్ అవసరం. కాబట్టి వాటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. చౌకగా దొరికే చీరలు కల్తీవి లేదా కృత్రిమ పట్టుతో తయారుచేసినవి కావచ్చు. కాబట్టి అధికారిక సంస్థల సిల్క్ మార్క్ సర్టిఫికెట్లను చూడండి. అవి చీర నాణ్యతను నిర్థారిస్తాయి. పట్టు చీరలు కొనేటప్పుడు నమ్మకమైన దుకాణాల్లో కొనడం మంచిది.