Skin Care: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు!
సాధారణంగా చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మం పొడిబారడం, దురద, జీవం లేనట్లుగా కనిపించడం వంటివి చాలామందిలో చూస్తుంటాం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

చలికాలంలో చర్మ ఆరోగ్యానికి పాటించాల్సిన చిట్కాలు
చలికాలంలో వాతావరణం చల్లగా మారటంతో పాటు గాలి పొడిబారుతుంది. ఈ మార్పులు చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. రోజువారీ స్కిన్‌కేర్‌లో చిన్న మార్పులు చేసుకుంటే చాలని చెబుతున్నారు.
మాయిశ్చరైజర్
చల్లని వాతావరణంలో చర్మంలోని నేచురల్ ఆయిల్స్ వేగంగా తగ్గిపోతాయి. దానివల్ల చర్మంపై పొర బలహీనపడుతుంది. కాబట్టి రోజుకు కనీసం రెండు సార్లు మాయిశ్చరైజర్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. లోషన్ కంటే క్రీమ్ లేదా బట్టర్-బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ఇవి చర్మానికి ఎక్కువ పోషణనందించి… చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.
వేడి నీటితో స్నానం వద్దు
చలికాలంలో ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం మానుకోవాలి. ఇది శరీరానికి హాయిగా అనిపించినా.. చర్మానికి అంత మంచిది కాదు. ఎక్కువ వేడి నీరు చర్మంలోని అవసరమైన సహజ ఆయిల్స్‌ను తొలగించి డీహైడ్రేట్ చేస్తుంది. నిపుణుల ప్రకారం గోరువెచ్చని నీటితో తక్కువ టైంలో స్నానం చేయడం మంచిది. అలాగే స్నానం సమయంలో మైల్డ్ క్లెన్సర్స్ లేదా మాయిశ్చరైజింగ్ బాడీ వాష్‌లు వాడటం ఉత్తమం.
నీరు తాగడం
సాధారణంగా చలి కాలంలో దాహం తక్కువగా అనిపించవచ్చు. కానీ శరీరం తన పనితీరును కొనసాగించడానికి తగినంత నీరు అవసరం. మనం తాగే నీరు చర్మానికి అంతర్గతంగా తేమను అందిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 2–2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. దానివల్ల చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. గ్లో కూడా సహజంగా పెరుగుతుంది.
హ్యూమిడిఫైయర్
చలికాలంలో ఇంట్లో గాలి పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి చర్మంలోని తేమను తొందరగా తగ్గిస్తుంది. హ్యూమిడిఫైయర్ గదిలో తేమను నిలబెట్టడానికి సహాయపడుతుంది. హ్యూమిడిఫైయర్ ని బెడ్ రూమ్ లో పెట్టుకుంటే.. చర్మం పొడిబారదు. పెదవులు, చేతులు, పాదాల దగ్గర దురద, చిట్లిపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
సన్‌స్క్రీన్
చలికాలంలో సూర్యకిరణాలు తక్కువగా ఉంటాయనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ హానికరమైన UV రేస్ మాత్రం ఏ కాలంలోనైనా చర్మంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయడం మంచిది. ఇది పొడిబారిన చర్మాన్ని రక్షించడమే కాకుండా ముందస్తు ముడతలు, స్కిన్ డ్యామేజ్‌ను కూడా తగ్గిస్తుంది.

